
* 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
* సీఎంతో చర్చించి సుప్రీంకోర్టుకెళ్తాం
* రిజర్వేషన్లను ఇచ్చి తీరుతాం
* బీజేపీ, బీఆర్ ఎస్ కుట్రల వల్లే ఈ పరిస్థితి
* హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పందించిన మంత్రులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీసీ బిడ్డలు అధైర్యపడొద్దని తెలంగాణ మంత్రులు భరోసా ఇస్తున్నారు. జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే, బీసీ సంఘాల ఆందోళన నేపథ్యంలో హైకోర్టు ప్రాంగణంలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ షబ్బీఆర్ అలీ స్పందించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. న్యాయస్థానం స్టే విధించకుండా బీసీ బిల్లును చట్టబద్దంగా రూపొందించామని, లెక్కలన్నీ పక్కాగా చూపించామని వివరించారు. అయినప్పటికీ ఇలాంటి తీర్పు బాధాకరమన్నారు. ఇప్పటికీ ఏం జరిగిపోలేదని, ఇంకా అవకాశం ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు తలెత్తినా రిజర్వేషన్లను ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా, ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీఆర్ ఎస్, బీజేపీల వల్లే ఈ దుస్థితి తలెత్తిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్దంగా రిజర్వేషన్ల అమలుకు కృషి చేసిందని వివరించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలు కాకుండా గవర్నర్ వద్ద, కోర్టుల్లోనూ అడ్డుకున్నది ఆ పార్టీలేనని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీసీ బిల్లును బీఆర్ ఎస్, బీజేపీ అడ్డుకున్నాయని ఆరోపించారు.