
* ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
ఆకేరు న్యూస్, మానకొండూర్ : ప్రజాహితమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం ఎల్ఎండీ కాలనీలో ప్రజాభవన్ లో తిమ్మాపూర్ మండలానికి చెందిన 72 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన 19 లక్షల 51వేల రూపాయల విలువ చేసే చెక్కులు ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు అన్యాయం జరిగిందన్నారు. కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుండా ప్రజలను దగా చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనతికాలంలోనే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు,ఉచిత విద్యుత్ అందిస్తున్నదని, ఉచిత బస్సు ప్రయాణం వల్ల సగటు మహిళలకు మేలు జరుగుతోందని,ప్రతిరోజూ పట్టణాలకు వెళ్లి షాపుల్లో పని చేసే మహిళలకు నెలకు కనీసం వెయ్యి రూపాయల మేరకు బస్ చార్జీల ఖర్చు తప్పుతున్నాయన్నారు. రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని, అందులో భాగంగానే ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మందులను అందుబాటులో ఉంచడమే కాకుండా వాటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ప్రైవేటు ఆస్పత్రులను వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకోవాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకున్న నిరుపేదలకు ప్రభుత్వ పరంగా కొంత మేరకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) ద్వారా సాయం అందజేస్తున్నామన్నారు. నిమ్స్ ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చయ్యే వైద్య చికిత్సల కోసం ఎల్వోసీ ఇప్పిస్తున్నామన్నారు. దీని వల్ల పేదలకు పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ కింద తిమ్మాపూర్ మండలానికి ఇప్పటి వరకు 20 విడుతలుగా 1364 మందికి 3,50,32,900 రూపాయలు మంజూరు కాగా, వాటిని చెక్కుల రూపంలో లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణగౌడ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కుంట రాజేందర్ రెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, పోలు రాము, రమేశ్, చింతల లక్ష్మారెడ్డి, గొట్టెముక్కుల సంపత్ రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, చింతల తిరుపతిరెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, నోముల అనిల్ గౌడ్, గోదారి తిరుపతి, జేజేల సంపత్, పోతుగంటి శ్రీనివాస్, మేడి అంజయ్య, బానుక సంపత్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..