* వరంగల్ నిట్ ఆధ్వర్యంలో 2006లో ప్రారంభం
* సాంకేతిక పరిజ్ఞానానికి సోపానం
* టెక్నోజియాన్ అంటే ఊహించి ..సృష్టించి.. జయించడం
ఆకేరు న్యూస్ , హనుమకొండ : ఇండియాలో ఉన్న ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీల్లో వరంగల్ నిట్ కాలేజి ఒకటి.. ఈ కాలేజీకి దేశ వ్యాప్త గుర్తింపు ఉండడమే కాదు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ కాలేజీలో చుదువుతుంటారు. భావితరాలకు ఉపయోగపడే మేథావులు, శాస్త్రవేత్తలు,సాంకేతిక నిపుణులు ఈ కాలేజీలో విద్యనభ్యసిస్తూ ఉంటారు.సంబంధిత సబ్జెక్టులో ఎంతో ప్రతిభ ఉంటే కాని ఈ కాలేజీల్లో సీటు రాదు.. ఇంటర్మీడియట్ లో కాలేజీ టాపర్లు కూడా నిట్ కాలేజీలో సీట్ పొందాలంటే ఎంతో కష్టపడాలి. నిట్ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతీ ఏడు టెక్నోజియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిట్ విద్యార్థులు 2006 లో ప్రారంభించారు.ఈ ఏడాది అక్టోబర్ 24 ,25 తేదీల్లో రెండు రోజులు ఈ ఉత్సావాన్ని నిర్వహిస్తున్నారు.
టెక్నోజియన్ గురించి….
ఒక రకంగా చెప్పాలంటే టెక్నోజియాన్ అనేది నూతన ఆవిష్కరణలకు పరిచయ వేదిక అని చెప్పాలి.
దేశంలోని వివిధ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు తాము రూపొందించిన ఆవిష్కరణలు టెక్నోజియాన్ లో ప్రదర్శిస్తారు. వారిలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వివిధ రంగాల్లో నిష్ణాతులైన మేధావులు, ఆవిష్కర్తలు,శాస్త్రవేత్తలు తమ అనుభవలాను విద్యార్థులతో పంచుకుంటారు. ఇంజనీరింగ్ విభాగంలో రోజు రోజుకీ వస్తున్న విస్తృతమైన మార్పుల గురించి చర్చ జరుగుతుంది. కొత్త కొత్త అనుభవాలను పరస్పరం పంచుకునే అవకాశం లభిస్తుంది. నిట్ లో జరుగుతున్న ఈ రెండు రోజుల ఈవెంట్ కు సుమారు 7,000 మంది విద్యార్థులు హాజరయ్యారని, వివిధ పోటీలలో 1,614 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని అంచనా. ఈ ఉత్సవంలో ప్రధాన విద్యార్థి సంఘాలు నిర్వహించే 23 ఈవెంట్లు మరియు డిపార్ట్మెంటల్ సొసైటీలు నిర్వహించే 31 ఈవెంట్లు ఉన్నాయి, ఉత్తమ ఆవిష్కరణకు రూ. 2 లక్షలు బహుమానం ఉంటుంది.ఈ ఏడాది జరుగుతున్న టెక్నోజియాన్ లో నిట్ వరంగల్ పూర్వ విద్యార్థిని ప్రస్తుతం IISc బెంగళూరులో ప్రొఫెసర్ గా పని చేస్తున్న మాధవి లత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాశ్మీర్ లోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి నిర్మాణంలో మాధవీ లత కీలక పాత్ర పోషించారు.
…………………………………………………
