* తీవ్ర రూపం దాల్చనున్న మొంథా తుఫాన్
* ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
* అప్రమత్తమైన అధికారులు
* విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఆకేరు న్యూస్ డెస్క్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరో మారు జలప్రళయం చుట్టు ముట్టేలా ఉంది.
బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తూఫాన్ గా రూపాంతరం చెందింది. తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం నైరుతి
పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో మొంథా కేంద్రీకృతమై ఉంది.గడచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదులుతోంది.ప్రస్తుతం చెన్నైకి 560 కిమీ,కాకినాడకు 620 కిమీ, విశాఖపట్టణానకి 650 కిమీ దూరం మొంథా కేంద్రీకృతమై ఉంది.రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని
వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. కాకినాడ వద్ద తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ డీప్ సీ పోర్టును మొత్తం ఖాళీ చేయించారు. ఎరువులు,చక్కెర,బొగ్గు గ్రాపైట్, వంట నూనె, బియ్యం నిల్వలతో ఉన్న 15 నౌకలను
సురక్షిత ప్రాంతానికి తరలించారు.
విద్యాసంస్థలకు సెలవులు
మొంథా తుపాను కారణంగా ఏపీ సర్కార్ పలు జిల్లాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది
తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల 27 నుంచి రెండు రోజుల పాటు సెలవును ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు, అంగన్వాడీలకు ఈ నెల 27, 28 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తీరప్రాంతాల్లో మొంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణశాఖ హెచ్చరికల మేరకు జిల్లా అధికారులు పలు చర్యలు తీసుకున్నారు తుపాను పరిస్థితుల దృష్ట్యా ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయొద్దని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో ప్రజలు తిరగవద్దని , ఇప్పటికే బీచ్లు, పర్యాటక రీక్రియేషన్ సంబంధిత కార్యకలాపాలను నిలిపివేసినట్లు వెల్లడించారు.
తెలంగాణలో..
మొంథా తుఫాన్ ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మంగళవారం జయశంకర్-భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. దీంతో ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో అక్కడకక్కడా, హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ నెల 30వ తేదీ తర్వాత వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని వెల్లడించింది.
………………………………………………………….
