* ఎలుకల మందు తిని 50 నెమళ్లు మృతి
* పంటను కాపాడుకోవడానికి ఎలుకమందును పెట్టిన రైతు
ఆకేరు న్యూస్, డెస్క్ : పంటను కాపాడుకోబోయి ఓ రైతు చేసిన పనికి 50 నెమళ్లు బలి అయ్యాయి. వివరాల్లోకి వెళితే..తమిళనాడులోని తెన్కాసి జిల్లా మీనాక్షిపురంలో జాన్సన్ అనే రైతు ఏపుగా ఎదిగిన పంటను తినేస్తున్నాయని అడవిపందులు, జంతువులు,పక్షుల నుంచి పంటను కాపాడుకోవాలని ఆహార పదార్థాలలో ఎలుకల మందు కలిపి పంట చుట్టూ చల్లాడు. దీంతో రాత్రి వేళ ఆహార వేటకు బయలు దేరిన నెమళ్లు జాన్సన్ మొక్కజొన్న చేనులోకి ప్రవేశించాయి . మొక్కజొన్న చేను చుట్టూ ఆహార పదార్థంలో కలిపిన ఎలుకల మందును తిని మృత్యువాత పడ్డాయి.నెమళ్లు మృతి చెందిన సమాచారం అందుకున్న పులియాంగుడి అటవీ శాఖ అధికారులు ,పోలీసులతో పాటు జాన్సన్ పొలం వద్దకు వెళ్లారు. పశువైద్య అధికారుల సహాయంతో మృతి చెందిన నెమళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటికి పోస్టు మార్టం నిర్వహించగా అవి విషప్రయోగం వల్ల చనిపోయినట్లు నిర్ధారణ అయింది. దీంతో జాతీయ పక్షి అయిన నెమళ్ల మృతికి కారణం అయినందున పోలీసులు రైతు జాన్సన్ను అరెస్టు చేశారు. ప్రమాదకరంగా పంటలను కాపాడుకోవడానికి ఎలుక మందు వాడటం వల్లనే నెమళ్లు మృతి చెందాయని తెలిపారు. ఈ సంఘటన తెన్కాసి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది.
…………………………………………………
