* వీధి కుక్కలు చేసే దాడులపై ప్రశ్నించిన ధర్మాసనం
ఆకేరు న్యూస్ డెస్క్ : వీధికుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కలు చేసే ఉన్మాదం భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. వీధి కుక్కలు మానవులపై చేసే క్రూరత్వం గురించి ఏమంటారు..? అని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నిచింది. వీధి కుక్కల దాడులపై సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ను సుప్రీం మళ్లీ సోమవారం విచారించింది. ఈ నేపధ్యంలో సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్క కుక్కల దాడులు దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది. వీధి కుక్కల బెడద వల్ల మన దేశం గురించి విదేశాల్లో చులకనగా మాట్లాడుకుంటున్నారని ధర్మాసనం తెలిపింది.సుప్రీం నియమాలను అమలుచేసే చర్యలపై అఫిడవిట్లు సమర్పించని.. రాష్ట్రాల సీఎస్‌లకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల.. కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలను సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు తమ ఆదేశాల.. అమలు వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి జస్టిస్ విక్రమ్ నాథ్ వాయిదా వేశారు. అలాగే అఫిడవిట్లను ఎందుకు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని.. సీఎస్‌లను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. వీధి కుక్కల బెడద ఢిల్లీలో తీవ్రంగా ఉంది . ఢిల్లీ వీధుల్లో కుక్కల సైరవిహారం అవి చేస్తున్న దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి ఈ నేపధ్యంలో వీధి కుక్కలను నియంత్రించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
జులై 28 ,2025న వీధికుక్కల దాడులు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీం కోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది.టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ప్రచురితమైన “ఇన్ ఎ సిటీ హౌండెడ్ బై స్ట్రేస్, కిడ్స్ పే ప్రైస్” అనే కథనం అధారంగా కేసును స్వీకరించింది. ఈ సందర్భంగా వీధుల్లో చెలరేగిపోతున్న కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆగస్టు 11న జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.కుక్కల పట్ల క్రూరత్వం ప్రదర్శించేవారిపై చర్యలు తీసుకోవాలని, ప్రజల ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని కూడా కోర్టు సూచించింది.
తీర్పుపై అభ్యంతరాలు…
సుప్రీంకోర్టు నిర్ణయంపై జంతు సంక్షేమ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా
నిరసన వ్యక్తం చేశాయి. ఆగస్టు 14న సుప్రీం తీర్పుపై స్టే విధించాలని కోరుతూ జంతు సంక్షేమ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.జంతు సంక్షేమ కార్యకర్తల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, సుప్రీం కోర్టు తన ఆగస్టు 11 నాటి తీర్పును సవరించింది.దూకుడుగా ఉండేవి లేదా రేబిస్ సోకిన కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని మిగిలిన కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసి, అవి ఉన్న ప్రాంతాల్లోనే తిరిగి వదిలివేయాలని ఆదేశించింది.ఆగస్టు 22 న స్పష్టం చేసింది.బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేధించి, ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సూచించింది.కేసు పరిధిని ఢిల్లీ-ఎన్సిఆర్కే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించింది.
రాష్ట్రాలపై ఆగ్రహం..
వీధి కుక్కల కేసులో అఫిడవిట్లను సమర్పించడంలో ఆలస్యం చేస్తున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్లు సమర్పించని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను నవంబర్ 3న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
రోజురోజుకూ కుక్కల దాడులు
ఆదివారం ఓ వరంగల్ లో ఓచిన్నారిపై వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా దాదాపు పది కుక్కలు మీద పడి దాడిచేశాయి, అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వీధి కుక్కలను తరిమి కొట్టడంతో చిన్నారి తీవ్ర గాయాలతో బతికి బయట పడింది. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గత నెల 14న చింతల్ ప్రాంతంలో ఒకే కుక్క నలుగురిపై దాడి చేసింది. ఐనవోలులో ఈ నెల 10న తండా కార్తీక్-ది వ్య దంపతుల మూడేళ్ల బాలుడు దేవాన్ష్ ఇంటి ఎదుట ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసి తీవ్రం గా గాయపరిచింది. ఆదివారం న్యూ శాయంపేట ప్రాంతంలో టైగర్స్ హిల్స్ కాలనీలో వీధి కుక్కల గుంపు కార్తీక అనే ఐదేళ్ల చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనను మరువక ముందే హనుమకొండ నయీంనగర్‌లోని లష్కర్‌సింగారం ప్రాంతంలో బాలుడిపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి.గతంలో గుంటూరులో జరిగిన సంఘటనలలో స్వర్ణభారతి నగర్లో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించగా, పొన్నూరులో కూడా అలాంటి సంఘటనే జరిగింది. ఈ సంఘటనల నేపథ్యంలో నగర పాలక సంస్థ బాలుడి కుటుంబానికి ₹5 లక్షల పరిహారం ప్రకటించింది. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. బెంగళూరు, మీరట్ లాంటి ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో అనేక మంది చిన్నారులు మృతి చెందారు.ఉత్తరప్రదేశ్ , ఒడిశా , మహారాష్ట్రలలో అత్యధిక సంఖ్యలో వీధికుక్కలు ఉన్నాయి. తమిళనాడు , మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో అత్యధిక సంఖ్యలో కుక్క కాట్లు జరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి.2018లో, ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లోని ఖైరాబాద్లో వీధికుక్కలు 14 మంది పిల్లలను చంపాయి . పిల్లల శరీర భాగాలను నమిలినందున వాటిని మ్యాన్-ఈటర్స్ అని పిలిచారు.
గ్రేటర్ వరంగల్ లో ..
గ్రేటర్ వరంగల్‌లో 40 వేలకు పైగా వీధి కుక్కలున్నట్లు అంచనా.అయితే కుక్కల నివారణకు బల్దియా అధికారుల వద్ద ప్రత్యేక ప్రణాళికలు లేకపోవడం గమనార్హం. కుక్కలు దాడి చేసిన ప్రాంతాలకు వాటిని పట్టే బృందాలను పంపించి చేతులు దులుపుకుంటున్నారు. ఒక్కో కుక్కను పట్టుకొని, వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి, వాటిని తిరిగి యథా ప్రాంతంలో వదిలేయడానికి బల్దియా రూ. 1350 వరకు ఇస్తున్నది. ఈ లెక్కన ఏటా రూ. కోటికి పైగా ఖర్చు చేస్తున్న బల్దియా అధికారులు వీధి కుక్కల బెడద నుంచి శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరుస ఘటనలతో బెంబేలు
ఉమ్మడి జిల్లాతో పాటు వరంగల్ నగరంలో వీధి కుక్కల దాడులు రోజురోజుకు తీవ్రమవుతున్నా యి.
తీవ్ర గాయాల పాలైన బాలుడిని తల్లిదండ్రులు అస్పత్రిలో చేర్పించారు. వారం రోజుల క్రితం కరీమాబాద్ ప్రాంతంలో భార్యకు మందులు తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తిపై వీధి కుక్కల గుంపు దాడి చేయడంతో ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వీధి కుక్కల బెడదను నివారించడానికి శాశ్వతంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
…………………………………………………………
