* ఆరు గ్యారెంటీల పేరుతో అర చేతిలో స్వర్గం చూపించారు
* రియల్ ఎస్టేట్ ను సర్వనాశనం చేశారు
* కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి..?
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : కాంగ్రెస్ కు ఓటేస్తే కష్టాలు తప్పవని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ టీడీపీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ నాయుడు.. ఆయన సతీమణి, టీడీపీ నాయకురాలు సుజాతతో పాటు పలువురు నాయకులను శనివారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అన్ని రంగాల్లో నాశనం అయిందన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిందన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారని విమర్శించారు. ఎన్నికల మందు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని అన్నారు. కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పారని తులం బంగారం ఇవ్వడం కాదు ఇప్పుడు మెడలో ఉన్న గొలుసును కూడా లాక్కునే పరిస్థితి వచ్చిందన్నారు.ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పి భార్యకి ఫ్రీ ఇచ్చి.. భర్త నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను కేసీఆర్ అమలు చేశారని.. కేసీఆర్ కిట్ ఇచ్చారని కొనియాడారు. తమ హయాంలో ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు ఇచ్చామని చెప్పారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో జరిగాయని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు.. ఇలా అన్ని పథకాలు బంద్ అయ్యాయని చెప్పారు.
………………………………….
