* కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండెంగా మారిన ఎన్నిక
* ఓడించేందుకు కంకణం కట్టుకున్న బీఆర్ ఎస్
* గెలిచేందుకు చెమటోడ్చుతున్న ముఖ్యమంత్రి
* జై ఎన్టీఆర్.. పీజేఆర్.. అంటూ వ్యూహాత్మ క ప్రచారం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పరీక్షే ఎదుర్కోబోతున్నారు. ఇక్కడి ఉప ఎన్నిక ఒక్క ఎమ్మెల్యే కోసమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా మారిపోయింది. భవిష్యత్ ఎన్నికలకు దిక్సూచిగా నిలవనుంది. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్, స్థానిక ఎన్నికలను ఇక్కడి గెలుపోటములు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం రేవంత్‌కు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అందుకే నవీన్ యాదవ్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ అంటూ కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్ లోనే తిరుగుతున్నారు. సమావేశం ఏదైనా అది ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఉంటోంది. కార్యక్రమం ఏదైనా అందులో జూబ్లీహిల్స్ ప్రస్తావన వస్తోంది. ఇక్కడ గెలుపు రేవంత్ కు ఇజ్జత్ కా సవాల్ గా మారిందనే సమీకరణాల నేపథ్యంలోనే పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఒక ముఖ్యమంత్రి ఇంతలా కష్టపడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
జై ఎన్టీఆర్.. పీజేఆర్..
జూబ్లీహిల్స్ ప్రచారంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తెలుగుదేశ కార్యకర్తలు, నేతలను కూడా ఆకర్షించేలా ప్రచారం సాగిస్తున్నారు. తెలుగుదేశంలో సుదీర్ఘ కాలంపాటు పనిచేసిన రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ లో దాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన ప్రసంగాలను బట్టి అర్థం అవుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తనదని ప్రకటించారు. మైత్రీవనం, వెంగళరావునగర్, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాలలో పర్యటించిన సమయంలో ఈ సంచలన ప్రకట చేశారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎన్టీఆర్‌కు నివాళులర్పించాలని ఆయన అభ్యర్థి నవీన్ యాదవ్ కు సూచించారు. దీనిద్వారా నియోజకవర్గంలోని టీడీపీ సానుభూతిపరుల ఓట్లను పొందే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ గెలిస్తే పీజేఆర్ పేరు..
స్థానికంగా పేరున్న మరో నాయకుడు పి.జనార్దన్ రెడ్డి ప్రస్తావనను కూడీ రేవంత్ ఈ ఎన్నికల్లో పదే పదే తెస్తున్నారు. పీజేఆర్ ప్రజల కోసమే పనిచేశారు.. ప్రజల కోసమే బతికారు.. ప్రజలు కూడా ఆయనకు ఏకంగా గుడినే కట్టారు. అలాంటి వ్యక్తిని గుర్తు చేసుకుంటూ బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పెడతామని రోడ్ షోలో ఇటీవల ప్రకటించారు. పీజేఆర్ కు ప్రజల మనిషిగా గుర్తింపు ఉంది. ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. మాస్ లీడర్ గా ఆదరణ పొందారు. బస్తీలు, కాలనీల్లో ఇప్పటికీ ఆయన పేరు చెబితే ఓట్లు పడతాయనడం అతిశయోక్తి కాదు. పార్టీ ఏదైనా, అభ్యర్థి ఎవరైనా పీజేఆర్ వారసుడిగానే.. ఇక్కడ ప్రచారం చేయడానికి కారణం ఇదే. తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు గెలిపించేందుకు ప్రచారం చేస్తున్న రేవంత్ కూడా పీజేఆర్ ప్రస్తావనను పదే పదే తెస్తున్నారు.
రేవంత్ కృషి ఫలించేనా?
మరోవైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్.. ఇక్కడ కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా రేవంత్ సామర్థ్యాన్ని దెబ్బతీయాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో మాగంటి గోపినాథ్ మరణంతో వచ్చిన సానుభూతితో పాటు, కాంగ్రెస్ వైఫల్యాలను ఓడించేందుకు ఎండగడుతూ ప్రచారం చేపడుతోంది. ఇక్కడ కాంగ్రెస్ ను ఓడించి గట్టి ఝలక్ ఇవ్వాలంటూ ప్రజలకు సూచిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీని ఓడిస్తేనే మిగిలిన కాలాన్ని చక్కగా పరిపాలిస్తుందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అలాగే ఆరు గ్యారెంటీల్లో విఫలమైన రేవంత్ కు బుద్ది చెప్పాలంటూ బాకీ కార్డు పేరుతో ఇంటింటికీ కరపత్రాలు పంచుతోంది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని సాధించి గ్రేటర్ పై పట్టు నిలుపుకోవాలని బీఆర్ ఎస్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు పాలనపై పట్టు లేదని తీవ్ర విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇటువంటి పరిణామాల క్రమంలో జూబ్లీహిల్స్ లో ఎలాగైనా కాంగ్రెస్ ను గెలిపించేందుకు ముఖ్యమంత్రి చెమటోడ్చుతున్నారు. మరి రేవంత్ కృషి ఫలిస్తుందా..? జూబ్లీహిల్స్ కాంగ్రెస్ జెండా ఎగురుతుందా అనేది వేచి చూడాలి.
………………………………………………..
