* బీడీ తాగి..ఆర్పకపోవడంతో ఘటన
* నిద్రలోనే సజీవ దహనం
* దండేపల్లి మండలం తళ్లపేటలో విషాదం
ఆకేరు న్యూస్, నిర్మల్ : తాగి పడేసిన బీడే.. తనువు తీసింది. బీడీ తాగి.. ఆర్పకుండా అలానే పడేయ్యడంతో ఘటన చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా దండేపల్లి మండలం తళ్లపేటలో చోటు చేసుకున్న ఈ సంఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తళ్లపేట గ్రామానికి చెందిన నాగయ్య(55) తన భార్య, కుమారుడు, కోడలితో కలిసి ఉంటున్నారు. బుధవారం రాత్రి తన గదిలో నాగయ్య ఒంటరిగా పడుకున్నాడు. బీడీ తాగే అలవాటు ఉండడంతో.. అర్ధరాత్రి వేళ వెలిగించాడు. బీడీ తాగి దాన్ని ఆర్పేయకుండానే అలానే పడేయ్యడంతో నిద్రలోకి జారుకున్నాడు. అగ్గి రగిలి.. మంటలు మంచానికి అంటుకున్నాయి. క్షణాల్లోనే బెడ్షీట్లకు మంటలు వ్యాపించి, నాగయ్య సజీవ దహనమయ్యాడు. కాలిన వాసన రావడంతో కుమారుడు, కోడలికి మెలకువ వచ్చింది. అప్పటికే మంటల్లో కాలిపోయిన నాగయ్యను బయటకు లాగారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాగయ్య మృతి తల్లపేట గ్రామంలో విషాదాన్ని నింపింది.
……………………………………………………………
