* 45 కు పైగా క్రిమినల్.. 3 పీడీ యాక్ట్ కేసులు..
* రాచకొండ కమిషనరేట్ నుంచి బహిష్కరణ
* పోలీసుల అదుపులో మరో ఏడుగురు
* వివరాలను వెల్లడించిన వరంగల్ డీసీపీ
ఆకేరు న్యూస్, వరంగల్ : రౌడీ షీటర్ సూరీని పోలీసులు అరెస్టు చేశారు. సూరి అలియాస్ దాసరి సురేందర్ మోస్ట్ వాంటెడ్‌గా పోలీసుల లిస్టులో ఉన్నాడు. సురేందర్‌తోపాటు ఏడుగురు అనుచరులను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు రివాల్వర్లు, మూడు మ్యాగజైన్స్, ఒక బుల్లెట్, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అరెస్టు వివరాలను మీడియాకు వెల్లడించారు. సీపీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముఠా కోసం గాలించామన్నారు. రాబరీ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా కొత్తగట్టు సింగారం వద్ద గ్యాంగ్‌ను పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. సూరిపై 45 క్రిమినల్ కేసులు, 3 పీడీ యాక్ట్ కేసులున్నాయన్నారు. చర్లపల్లి జైల్లో బీహార్‌కు చెందిన ఠాకూర్‌తో సూరికి పరిచయం ఏర్పడిందని.. అతని ద్వారా బీహార్ నుంచి రెండు షార్ట్ వెపన్స్ కొనుగోలు చేశారని తెలిపారు. వరంగల్ అడ్డాగా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. భూపాలపల్లిలో కొంతమందిని హత్య చేసేందుకు చర్చలు జరిపారని.. అయితే సూరి గ్యాంగ్ నేరాలను ముందే అడ్డుకున్నామన్నారు. సూరితో పాటు అతని ముఠా సభ్యులు మరో ఏడుగురిని అరెస్ట్ చేశామని డీసీపీ అంకిత్ కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. గాలించామన్నారు. సూరీని పట్టకున్న పోలీసులను డీసీపీ అభినందించారు.
