* ఐదో దశ ఎన్నికలు ప్రారంభం
* బరిలో కాంగ్రెస్ అగ్రనేత సహా పలువురు ప్రముఖులు
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశంలో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections 2024) సమరంలో నేడు ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఐదో దశలో కేవలం 49 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.., ఆ స్థానాలు ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించడం, పలువురు హేమాహేమీలు బరిలో ఉండడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేఠీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాజధాని లఖ్‌నవూ నుంచి మూడోసారి బరిలోకి దిగుతున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, శరణ్ (బిహార్)లో బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, హాజీపూర్‌లో రాంవిలాస్ పాసవాన్ కుమారుడు చిరాగ్ పాసవాన్ వంటి ప్రముఖులు ఈ దశలో జరిగే ఎన్నికల పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ఈసారి ఆమె తనయుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతుండడం గమనించాల్సిన విషయం.తన బలం నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 39 స్థానాల్లో బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ హోరాహోరీగా పోరాడింది. కాగా, ఐదోదశలో ఝార్ఖండ్‌లో మూడు స్థానాలు, ఉత్తరప్రదేశ్ లో 14, ఒడిశాలో అయిదు, బిహార్‌లో అయిదు, మహారాష్ట్ర 13, పశ్చిమబెంగాల్ 7, లద్దాఖ్ ఒకటి, జమ్ముకశ్మీర్‌లో ఒక స్థానం ఉన్నాయి.
——-