* సాహితీలోకం దిగ్భ్రాంతి
* తెలంగాణ రాష్ట్ర గీతం.. జయ జయహే గేయరచయిత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ మనిషి, ఆధునిక పోతన, సాహితీ శిఖరం అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడూ.. అంటూ మారుతున్న సమాజ ధోరణులపై కలత ఆయన కలం.. ఇకపై ఆగిపోయింది. తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం రూపంలో అందరిలో మదిలో చిరస్థాయిలో నిలిచిపోయిన అందెశ్రీ ఆయన ఇంట్లో ఈరోజు ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉదయం7:25 నిమిషాలకు మరణించినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
ఉద్యమంలోనూ కీలక పాత్ర
1961 జూలై 18న సిద్దిపేట జిల్లా మద్దూరి మండలం రేబర్తిలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తెలంగాణ (Telangana) ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఈయన గొడ్ల కాపరిగా పని చేశారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని అతడిని చేరదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందెశ్రీ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేశారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. బతుకమ్మ సినిమాకు ఈయన మాటలు కూడా రాశారు.
రేవంత్ సర్కారు పెద్ద పీట
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అందెశ్రీకి ముఖ్యమంత్రి రేవంత్ (Chief Minister Revanth) పెద్ద పీట వేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా, మహోన్నతమైన పాత్రను నిర్వర్తించిన ఆయన సేవలను గుర్తించారు. తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించిన ఆయనకు రూ.కోటి నజరానాను అందించారు. తెలంగాణ రాష్ట్ర గీతం.. జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆయనతో రాయించారు.
అందెశ్రీ రాసిన కొన్ని ప్రముఖ గీతాలు
* జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
* పల్లెనీకు వందనములమ్మో
* మాయమై పోతున్నడమ్మో మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు
* గలగల గజ్జెలబండి
* కొమ్మ చెక్కితే బొమ్మరా…
* జన జాతరలో మన గీతం
* యెల్లిపోతున్నావా తల్లి
పురస్కారాలు.. గుర్తింపులు
* 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈయనను భారత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీకి ప్రతిపాదించింది.
* ఆర్ నారాయణమూర్తి ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు గీతాన్ని ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు.
* కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది.
* అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు లోకకవి అన్న బిరుదునిచ్చి 2014 ఫిబ్రవరి 1లో సన్మానించారు.
* వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం
* డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం
* నంది పురస్కారం
* సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం
* దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం
* లోక్ నాయక్ పురస్కారం
………………………………………………………………
