ఆకేరు న్యూస్, డెస్క్ : అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) (bollywood actor dharmendra) కోలుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు శ్వాసకోశ సమస్యల కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయ్యారు. ఆయన కుమారుడు బాబీడియేల్ దగ్గరుండి ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు ఇంట్లోనే చికిత్స కొనసాగనుంది. అయితే, ఆయన మరణించారన్న వార్తలు నిన్న పుకార్లు షికార్లు చేశాయి. ప్రధాన మీడియాలో సైతం ఆయన మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. తన నాన్న బాగానే ఉన్నారని ఆయన కుమార్తె ఈషా డియోల్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.
ఆస్పత్రిలో చేరిన గోవిందా..
మరో ప్రముఖ బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా (bollywood actor govinda) మంగళవారం రాత్రి స్పృహ కోల్పోవడంతో జుహు శివారులోని క్రిటికేర్ ఆసుపత్రిలో చేరారు. 61 ఏళ్ల నటుడు నిన్న రాత్రి ఆలస్యంగా ఇంట్లో దిక్కుతోచని స్థితి కారణంగా స్పృహ కోల్పోయారని ఆయన స్నేహితుడు, న్యాయ సలహాదారు లలిత్ బిందాల్ తెలిపారు. తొలుత టెలిఫోనిక్ కన్సల్టేషన్ ద్వారా వైద్యుడిని సంప్రదించి మందులు వేసుకున్నారు. అర్ధరాత్రి 1 గంటకు అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చినట్లు బిందాల్ ధృవీకరించారు. వైద్యులు ఆయనకు అన్ని రకాల పరీక్షలూ నిర్వహించారు. ఇంకా రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
………………………………………………………………
