* పోలింగ్ అనంతరం వరుస సమావేశాలు
* పరిపాలనపై అధిక దృష్టి
* నేడు పరిశ్రమల శాఖలో సమీక్ష
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పోలింగ్ ముగిసిన నాటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి సారించారు. శాఖల వారీగా పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. నిన్న కేబినెట్ భేటీలోనూ కీలక అంశాలపై చర్చించిన సీఎం రేవంత్ ప్రజలకు సంబందించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేడు పరిశ్రమల శాఖలోని పరిస్థితిపై సమీక్షించనున్నారు.
తొలుత కీలకమైన ఆర్థికశాఖతో..
ఆరు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అధికారులు, మంత్రులతో సమీక్షించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టతకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు, వ్యవసాయంపై కూడా ఆయన సమీక్షించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించారు. ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవటంతో, తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునురుద్ధరణ చర్యలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ సీఎంతో పాటు మంత్రులకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి వివరించారు.
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో దాదాపు నాలుగు గంటల పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లపై రూ.500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా కొనసాగేందుకు కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. రేపటి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సబ్కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని మంత్రులు తెలిపారు. ఇక నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. రైతులు లూజు విత్తనాలు కొనొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రధానంగా విద్యారంగ అభివృద్ధికి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మ ఆదర్శ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించింది.
నేడు పారిశ్రామికాభివృద్ధిపై సమీక్ష
ఈరోజు పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ముఖ్య అధికారులతో చర్చించనున్నారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలు.. దివాళ తీసిన పెద్ద పరిశ్రమలపై ఆరా తీయనున్నట్టు తెలుస్తుంది. కాగా..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో తెలంగాణలో ఐటీ కారిడార్‌తో సమానంగా.. ఇండస్ట్రీయల్ కారిడార్ ను కూడా సమానంగా అభివృద్ధి చేస్తామని.. రేవంత్ రెడ్డి ప్రకటించారు.. ఇటు.. ఔటర్ రింగ్ రోడ్డు.. అటు ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ముందే ప్రకటించారు.. అందుకు అనుగుణంగానే ఈరోజు ఈసమావేశంనిర్వహించన్నట్టు తెలుస్తుంది.
———