* గెలుపులో సీఎం రేవంత్ మార్క్
* డిపాజిట్ దక్కని బీజేపీ
* 24, 658 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ గెలిచింది. ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజార్టీ సాధించారు. సర్వేలు చెప్పినట్లుగానే ఆయా పార్టీల నాయకులు ఫలితాలు సాధించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆయన అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక నిర్వహించారు. బీఆర్ ఎస్ నుంచి గోపీనాథ్ భార్య మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, లంకల దీపక్‌రెడ్డి బీజేపీ నుండి పోటీకి దిగారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ మధ్యే హోరా హోరీగా ప్రచారం సాగింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తదితర నాయకులు సెంటిమెంట్‌తో ముందుకు సాగారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోడీ నినాదంతో గెలుపు ధీమాతో ముందుకు సాగారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకొని.. సంక్షేమ పథకాలతో ప్రజల వద్దకు వెళ్లింది. అఖండ విజయం సాధిచింది.
పడిలేచిన కెరటం నవీన్ యాదవ్..
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. పడిలేచిన కెరటంలా భారీ విజయం సొంతం చేసుకున్నారు.
యూసుఫ్‌గూడా నుంచి 2009 లో ఎంఐఎం నుంచి కార్పొరేటర్‌గా బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓటమిపాలయ్యారు. మళ్లీ ఎంఐఎం నుంచి 2014లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీకి దిగారు. 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2015లో ఎంఐఎం అభ్యర్థిగా కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమిచెందారు. 2018లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఎల్ ఏగా స్వాతంత్ర అభ్యర్థిగా 18,817 ఓట్లు సాధించారు. 2023 నవంబర్ 15న అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 2025 నవంబర్‌లో నిర్వహించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 24, 658 ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు.
గెలుపునకు కారణాలు ఇవే..
నవీన్ యాదవ్ గెలుపునకు అనేక కారణాలు పనిచేశాయి. ముఖ్యంగా నవీన్ యాదవ్ స్థానికుడు కావడం. చిన్పప్పటి నుండి అదే ప్రాంతంలో ఉండడం వల్ల స్థానికులకు నవీన్ యాదవ్ తో అనుబంధం ఉంటుంది. పైగా ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవచ్చు అనే ధీమా ఉంటుంది. దీనికి తోడు నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ జూబ్లీహిల్స్ ప్రజల్లో మమేకమైపోయారు. ఆ ప్రాంతంలో ఆయన చెప్పిందే వేదంగా నడుస్తోంది. గతంలో ఓటమిని చవిచూసిన నవీన్ యాదవ్ పై ప్రజల్లో సానుభూతి ఉంది. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నట్లుగా ఉన్నారు.నవీన్ యాదవ్ సంక్షేమ కార్యక్రమాలను స్వచ్చందంగా చేస్తారనే పేరుంది. బస్తీ పిల్లలకు చదువులో ప్రోత్సాహం, పేదలకు ఆర్థిక సహాయం పేదల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించడం, సామూహిక సీమంతాలు మొదలైన కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.యాదవ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో పార్టీలకతీతంగా యాదవ సామాజిక వర్గం నవీన్ యాదవ్ కు మద్దతు పలికిందనే చెప్పాలి.
మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో నవీన్ యాదవ్ కు బంధుత్వం ఉంది. శ్రీనివాస్ యాదవ్ కూడా లోపాయకారీగా నవీన్ యాదవ్ కు మద్దతు ఇచ్చారనే ప్రచారం ఉంది. మైనారిటీల మద్దతు ఉంది. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు పూర్తి మద్దతునిచ్చింది. గత ఎన్నికల్లో మాగంటి చేతిలో జూబ్లీహిల్స్ లో ఓడిపోయిన అజహరొద్దిన్ కు మంత్రి పదవి ఇవ్వడం కూడా ఓ కారణం. 2023 లో జరిగిన ఎన్నికల్లో అజహర్ గెలిస్తే నియోజకవర్గానికి ఓ మంత్రి ఉండే వాడు అన్న ఆలోచన జూబ్లీ ప్రజల్లో వచ్చినట్లుగా భావించాలి. గతంలో చేసిన పొరపాటును మళ్లీ చేయకూడదు అనుకొని ఉంటారు. పైగా అధికార పార్టీకీ ఓటేస్తేనే అంతో ఇంతో లాభం ఉంటుందని భావించి ఉంటారు.
కలిసివచ్చిన బీఆర్ ఎస్ ప్రచారం
బీఆర్ ఎస్ నాయకులు కేటీఆర్,హరీష్ రావులు గత పదేళ్లలో జూబ్లీ హిల్స్‌లో ఏం అభివృద్ధి చేశారో చెప్పలేక పోయారు. ప్రచారం మొత్తం నవీన్ యాదవ్ పైనే గురి పెట్టారు. నవీన్ యాదవ్ ను పదే పదే రౌడీ అన్నారు. కానీ నవీన్ యాదవ్ చేసిన రౌడీ పనులను ప్రజలకు వివరించలేక పోయారు. మాగంటి గోపీనాథ్ సతీమణి అనే సానుభూతితో ఓట్లు పడతాయనే విశ్వాసాన్ని ప్రదర్శించారు.
తీరు మారని బీజేపీ.. కాంగ్రెస్ ఓటమే ముఖ్యం
ఇక బీజేపీ విషయానికొస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్ననియోజకవర్గం అయినా ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేక పోయింది.బీజేపీకి కాంగ్రెస్ గెలవకుండా ఉండడమే లక్ష్యం. అది గతంలో ఎన్నో సార్లు రుజువయింది. ఎన్నికల ఫలితాలు రాక ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పార్టీ అలోచనను బయట పెట్టాడు. ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతామని ముందే తెలుసు అన్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ బీఆర్ ఎస్ కు పరోక్షంగా సహాయం చేసిందని భావించాలి. బీ ఆర్ ఎస్ ను నిర్మోహమాటంగా విమర్శించే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను మరో బీజేపీ నేత విశ్వేశ్వర్ రెడ్డిని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచారు. వాళ్లు ప్రచారం చేస్తే బీఆర్ ఎస్ ఓట్లు కాంగ్రెస్ కు టర్న్ అయ్యే అవకాశం ఉందని మందు జాగ్రత్త చర్యగా వారిద్దరినీ ప్రచారానికి దూరంగా ఉంచారు. దానికి తోడు కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ప్రచారంలో అదే పాత ధోరణిని ప్రదర్శించారు. ముస్టిం మైనారిటీలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆయనప్రచారంతో మైనారిటీ ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ కు పడ్డాయని చెప్పవచ్చు
గెలుపులో రేవంత్ మార్క్..
మొదటి నుంచి సీఎం రేవంత్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారు. అందుకు తగ్గ ప్రణాళిక రూపొందించి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అంతటితో ఆగకుండా తానే స్వయంగా డివిజన్ల వారీగా పర్యవేక్షించారు. ముఖ్యంగా బీసీ నినాదంతో ముందుకెళ్లారు. 80 వేలకు పైగా ఓటర్లు ఉన్న మైనార్టీలను మచ్చిక చేసుకున్నారు. మంత్రివర్గంలో మైనార్టీలకు అవకాశం కల్పించారు. ప్రముఖ క్రికెటర్ అజారొద్ధీన్ను మంత్రిగా చేశారు. మైనార్టీ, బీసీ నినాదం, సంక్షేమ పథకాలతో విజయానికి దోహదపడ్డాయి. సీఎం రేవంత్ వేసిన ఫ్లాన్‌తో విజయం సాధించారు.
