* నవీన్‌యాదవ్ గెలుపులో కీలక పాత్ర
* అధిష్ఠానంలోనూ పాజిటివ్ ఒపినీయన్
* ఇప్పుడంటారా రిఫరెండెం అని?
* విపక్షాలకు కాంగ్రెస్ కౌంటర్
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నిక అనే విషమ పరీక్షలో ఫస్ట్‌క్లాస్‌లో ప్లాస్ అయ్యారు. తన సత్తా ఏంటో నిరూపించుకుని పార్టీలోనే కాకుండా.., రాష్ట్రంలోనూ పట్టు సాధించారు. ముఖ్యమంత్రిగా మరో మెట్టు పైకెక్కారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్‌యాదవ్ గెలుపులో రేవంత్ రెడ్డి పాత్ర కీలకం. ఆయన గెలుపులోనే కాదు.. అంతకు ముందే నవీన్ కు సీటు ఇప్పించడంలోనూ సక్సెస్ అయ్యారు. తన అభ్యర్థి గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు. ప్రకటనలు, మంత్రులతో సమావేశాలకే పరిమితం కాలేదు. సీఎం రేవంత్‌రెడ్డి కేవలం రోడ్డు షోలతో మాత్రమే ఆగలేదు. నాలుగు రోజుల పాటు బోరబండ, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, షేక్‌పేట, రహమత్‌నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ ప్రాంతాలను చుట్టేశారు. అంతకు ముందే ప్రజలను కలుస్తూ, బస్తీలు, కాలనీలు చుట్టేసే బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లకు అప్పగించి వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
వ్యూహం ఫలించింది..
ఉప ఎన్నికలో రేవంత్ అనుసరించి వ్యూహం ఫలించింది. జూబ్లీహిల్స్‌లో 30 వేల మెజార్టీతో గెలుస్తున్నామని ఆయన ముందే శ్రేణులకు భరోసా ఇచ్చారు. దానికి దగ్గరగా మెజారిటీ సాధించారు కూడా. ఆ మేరకు ఆయన విశేషంగా పని చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా.. తనదే బాధ్యత అనే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించడంతో ఉప ఎన్నిక రసవత్తరంగా సాగింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధిని నగర ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఎన్నికల ప్రచారపర్వాన్ని భుజానికెత్తుకున్నారు. ఉప ఎన్నికల టికెట్ ఖరారయ్యే వరకు అభ్యర్థుల బలాబలాలను చూడగా.. ఎన్నికల ప్రచారం చివరికి చేరే సరికి సీఎం రేవంత్‌రెడ్డి వర్సెస్ అనే విధంగా సాగింది. ముఖ్యమంత్రిగా అధికారంగా బిజీ షెడ్యూల్ ఉన్న కానీ ఉప ఎన్నికల్లో మూడు రోజుల పాటు రోడ్డు షోలు నిర్వహించి నియోజకవర్గంలోని అన్నీ డివిజన్లను చుట్టేశారు. నాలుగు రోడ్డు షోలతోనే సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకున్నారు.
మరింత గుర్తింపు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా రేవంత్ విజయం సాధించారు. ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం నగరంలోని మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలాంటి చార్జీలు లేకుండా ప్రయాణం చేస్తున్నారా? లేదా? అని మహిళలను అడిగి మరీ పథకాలను వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎన్నికల తర్వాత 4వేల ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని, మైనార్టీలకు ఖబరాస్తాన్ సమస్యను పరిష్కారం చేస్తానని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపర్చడంతో పాటు ఇళ్లపై ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లను తొలగిస్తానని హామీనిచ్చారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేయడానికి అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి జూబ్లీహిల్స్ ఓటర్లు జై కొట్టారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం అందించారు. జూబ్లీహిల్స్ గెలుపుతో రేవంత్ కు అధిష్ఠానంలో మరింత గుర్తింపు పెరిగింది. ఎమ్మెల్యే స్థానం గెలిచిన మర్నాడే అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు రేవంత్. ఆప్యాయంగా ఆయనను రాహుల్ పలకరించడంతో.. వారి మధ్య విభేదాల అన్న వార్తలకు చెక్ పడింది.
………………………………………………………..
