* కాల్చి చంపి.. కథలు చెబుతున్న బండి సంజయ్
* హిడ్మా ఎన్కౌంటర్ ముమ్మాటికీ బూటకమే
* మావోయిస్టుల పక్షాన న్యాయ పోరాటం
* బండి వ్యాఖ్యలకు కూనంనేని కౌంటర్
ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
సాంబశివరాలు మండిపడ్డారు. మావోయిస్టు నేతలను పట్టుకొని కాల్చి చంపుతున్నారని.. హిడ్మాను చంపి ఎన్కౌంటర్ అని పేరుపెట్టారని..ఎన్కౌంటర్ అంటే పరస్పరం దాడులు చోటుచేసుకోవాలి కదా.. అని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఏకపక్షంగా కాల్పులు చేపట్టి.. దాన్ని బండి సంజయ్ ఎన్కౌంటర్ అంటున్నారని దుయ్యబట్టారు. మావోయిస్టులతో చర్చించి.. సమస్యల పరిష్కారానికి మార్గం చూపాల్సింది పోయి ప్రాణాలను హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 మార్చి 30 నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా టార్గెట్ పెట్టారని.. దానికి బండి సంజయ్ వత్తాసు పలుకుతున్నారని.. మావోయిజాన్ని అంతం చేయడానికి ఇదేమైనా యుద్ధమా అని ప్రశ్నించారు. ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అడవుల్లోని ఖనిజ సంపదను దోచుకునేందుకే ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నారు. మావోయిస్టుల పక్షాన కాల్పుల విరమణ ప్రకటించినా..కాల్చి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక్క పోలీసుకూ గాయాలు ఎందుకు కాలేదో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. కోర్టులు మౌనంగా ఉండకూడదని.. ఈ ఘటనలను సుమోటోగా స్వకరీంచాలని కోరారు. ఎన్కౌంటర్లపై రేపు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
………………………………………………………….
