* 1958లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే చిత్రంతో తెరంగేట్రం
ఆకేరు న్యూస్, డెస్క్: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. 89 ఏండ్ల ధర్మేంద్ర గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించి సోమవారం కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. పది రోజుల క్రితం ముంబై లోని క్యాండి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ధర్మేంద్ర వెంటిలేటర్‌పై ఉన్నారంటూ పలు కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాసవిడిచారు. మరోవైపు ధర్మేంద్ర నివాసం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్..
బాలివుడ్లో ఆయనకు హీ మ్యాన్‌గా పేరుంది. 1958లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే చిత్రంతో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర, తన కెరీర్లో “షోలే”, “చుప్కే చుప్కే”, “ధర్మ్ వీర్”, “సీటా ఔర్ గీత”, “యాదోం కి బారాత్” వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. స్క్రీన్‌పై తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్, అద్భుతమైన స్టైల్‌తో ఆయనకు అభిమానులు “హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్” అనే బిరుదు ఇచ్చారు. ధర్మేంద్ర నటించిన తాజా చిత్రం ‘ఇక్కీస్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. 1980లో ప్రముఖ నటీ హేమమాలీని రెండో వివాహం చేసుకున్నారు. 300 చిత్రాలకు పైగా నటించారు. ఆయన నటనకు గాను 2012లో పద్మభూషణ్‌తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. బికనుర్ నుంచి 2004లో బీజేపీ ఎంపీగా గెలిచారు. ఆయన కన్నుమూశారన్న వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు నివాళ్లు అర్పించారు. రాజకీయ నాయకులు సంతాపం వెలిబుచ్చారు. ధర్మేంద్ర పార్థివ దేహాన్ని విల్లే పార్లీ శ్మశాన వాటికకు కుటుంబ సభ్యులు తరలించారు.
…………………………………………………
