* అధికారులకు హైదరాబాద్ కలెక్టర్ ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతీ వారం కలెక్టరేట్లో జరిగే కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. వాటిని విభాగాల వారీగా విడదీసి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. దివ్యాాంగులు, వయోవృద్ధులు వాట్సాప్ నెంబరు నుంచి వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. వివిధ సమస్యలపై ప్రజలు అందచేసిన అర్జీలను జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు శాఖల వారీగా తగిన చర్యలు తీసకోవాలన్నారు. అర్జీదారులు ఒకే సమస్యపై పదే పదే రాకుండా చూడాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజావాణి ముఖ్య ఉద్దేశమని, విన్నపాలను వెంటనే పరిష్కరించి, ప్రజావాణి పట్ల దరఖాస్తుదారులకు నమ్మకం కల్పించాలన్నారు. సీఎం ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తుల పురోగతిని సమీక్షించి పెండింగ్లో ఉన్న అర్జీలపై జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న గ్రీవెన్లో వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి, త్వరితగతిన పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రజావాణిలో హౌసింగ్శాఖ 162, (డబుల్ బెడ్రూం- 23, ఇందిరమ్మ ఇళ్లు 139), పెన్షన్స్ 21, రెవెన్యూ 29, ఇతరశాఖలు 37 కలిపి మొత్తం 249 అర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు.
………………………………………………….
