* కాసేపట్లో మంత్రుల మీడియా సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సుదీర్గంగా కొనసాగింది. దాదాపు 4 గంటలపాటు మంత్రులు కీలక అంశాలపై చర్చించారు. విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రధాన అంశాలపైనే ఈరోజు ప్రధాన చర్చ జరిగినట్లు తెలిసింది. 12 గంటలకు సమావేశమైన సమావేశం దాదాపు 4గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. ముఖ్యంగా రామగుండంలో థర్మల్ ప్రాజెక్టు నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందిపరిచిన నేపథ్యంలో అందుకు భారీ స్థాయిలో ఖర్చు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మించాలా, లేదా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అని విద్యుత్ శాఖను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ప్రస్తతం ఉన్న విద్యుత్ డిమాండ్ ఎంత? రానున్న కాలంలో ఎంత పెరగబోతోంది.. 2047 వరకు ఎంత డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయనే అంశాలపై చర్చించినట్లు తెలిసింది. రామగుండంతో పాటు ఇంకా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై మాట్లాడారు. సోలార్ విద్యుత్ ప్రోత్సహించేలా, ఉత్పత్తిని పెంచేలా చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కాసేపట్లో జరిగే మంత్రుల మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ బిల్లుల ధరలు పెంచాలంటే విధి విధానాలు, పెంచాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.
……………………………………………….
