* రాష్ట్ర ఆవిర్భానికి కారణమైన ముఖ్యఘట్టం
* దీక్షా దివస్ కు నేటితో 16 ఏళ్లు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
అప్పటికే మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనన్న నినాదం మార్మోగుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. 2009 నవంబరు 29న తెలంగాణ ఉద్యమంలో ఓ కీలక ఘట్టం నమోదైంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావు నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడే వరకు పట్టువీడలేదు. శరీరం నీరసించినా, పట్టుతప్పుతున్నా, దీక్ష విరమించాలని ఇతర పార్టీలకు చెందిన ఎందరో ఎమ్మెల్యేలు, ఎంపీలు నచ్చచెప్పినా, ప్రమాదకర వైద్యులు హెచ్చరించినా.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని చెప్పి ఆస్పత్రిలో సైతం ఆయన దీక్ష కొనసాగించారు. డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాతే దీక్ష విరమించారు.
అన్యాయాన్ని నిరసిస్తూ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందనే అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. నిధులు, నియామకాల్లో సమానత్వం లోపిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో మా రాష్ట్రం మాక్కావాలే.. అని డిమాండ్ ఊపందుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కేంద్రం తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చే యత్నాలను తీవ్రతరం చేసింది. అయితే కాలంగడుస్తున్న కొద్దీ మరో ఉద్యమం పురుడుపోసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమతి స్థాపకుడు కేసిఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపారు. తెలంగాణ వచ్చుడో…కేసిఆర్ సచ్చుడో అన్న నినాదంతో 2009, నవంబరు 29వ తేదీన నిరవధిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు.
జైలులోనే దీక్ష
ఎన్ని రకాలుగా నిరసనలు తెలిపినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. దానికనుగుణంగా పార్టీ నాయకులు, అన్ని వర్గాలతో చర్చలు జరిపి నవంబర్ 29వ తేదీన కరీంనగర్, తీగలగుట్టపల్లి నుంచి ‘దీక్షా దివస్’ దీక్షా శిబిరానికి పయనమయ్యారు. ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటుచేసిన దీక్షా స్థలం వద్దకి బయల్దేరిన కేసీఆర్ వాహనంను కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీసు బలగాలు, రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు చుట్టుముట్టాయి. వాహనం నుంచి కేసీఆర్ ను బలవంతంగా దించేశారు. ఆయన రోడ్డుమీదే ధర్నా చేస్తుండడంతో ఖమ్మం జైలుకు తరలించారు. ఆ జైలులోనే తన దీక్షను ప్రారంభించారు.
అయినా వెనక్కి తగ్గలే…
డిసెంబరు 1న ‘నేను లేకున్నా ఉద్యమం నడవాలి’ అని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబరు 2న పార్లమెంట్లో అద్వానీ ఈ దీక్షను ప్రస్తావించారు. ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబరు 3న కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ‘తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర’ అని నిమ్స్ నుంచే కేసీఆర్ ప్రకటించారు. 4న రక్తంలో పొటాషియం, సోడియం తగ్గడంతో కేసీఆర్‌ను అత్యవసర వైద్య విభాగానికి తరలించారు. కోమాలోకి పోయే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరించారు. ప్రజలు మెచ్చే ప్రకటన చేసే వరకు తన దీక్ష, తెలంగాణ ప్రజల ఆందోళనలు కొనసాగుతాయని అన్నారు. 5న వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ఎంపీలు కలిసి దీక్ష విరమించాలని కోరినా కేసీఆర్ నిరాకరించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడితేనే విరమిస్తానని అన్నారు. దాంతో రాష్ట్ర రాజధాని ఫ్రీజోన్ కాదని అసెంబ్లీలో తీర్మానం పెడతామని, కేసీర్‌పై కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 6న అసెంబ్లీలో 14ఎఫ్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశారు.
దిగొచ్చిన కేంద్రం
డిసెంబరు 7న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నిపార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. డిసెంబరు 8న కేసీఆర్ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నదని, ప్రొటీన్లు, అల్బుమిన్లు లోపించాయని, ఇక తమ చేతుల్లో ఏమీలేదని వైద్యులు తెలిపారు. తెలంగాణ దిశగా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. దాంతో డిసెంబరు 9న కాంగ్రెస్ కోర్ కమిటీ ఐదుసార్లు సమావేశమైంది. సమావేశం నుంచి చిదంబరం బయటికి వచ్చి ఫోన్లో కేసీఆర్, జయశంకర్‌సార్‌తో సంభాషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనపై సమాలోచనలు జరిగాయి. రాష్ట్ర ఏర్పాటు ప్రకటన విషయంలో స్పష్టమైన పదజాలం ఉండాల్సిందేనని చిదంబరానికి స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన చేయాలన్న సోనియా సూచన మేరకు కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం మాట్లాడుతూ… అనేక పరిణామాల అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని, విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని ప్రకటించారు. అనంతరం నిమ్స్ నుంచి ‘ఇది తెలంగాణ ప్రజల విజయం’ అని కేసీఆర్ అన్నారు. ఎన్నో ఉద్యమాలకు తోడు.. 11 రోజుల సుధీర్ఘ దీక్షతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
