* హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
* ఆకట్టుకున్న దివ్యాంగుల ప్రదర్శన
ఆకేరు న్యూస్, హనుమకొండ : దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో జిల్లా మహిళా, శిశు,దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా జిల్లా సంక్షేమ అధికారి జె. జయంతి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ దివ్యాంగుల నుండి నేర్చుకోవాల్సిన ఉన్నాయని పేర్కొన్నారు. ఏదో కావాలి అనుకునే మిగతా వారి కంటే ఉన్నంతలోనే మీరంతా ఎంతో సంతోషంగా ఉన్నారని ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుందన్నారు. మిగతా వారితో దయ, కరుణ, సహానుభూతి, ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసంతో ఉంటారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. పెన్షన్లు, భవిత కేంద్రాలు, స్కాలర్ షిప్పులు, ప్రత్యేక స్వయం సహాయక సంఘాలు, విద్యా, ఉపాధి, గృహ కల్పనలో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దివ్యంగుల శక్తి సామర్థ్యాలకు ఎలాంటి పరిమితులు, హద్దులు లేవని అన్నారు. మనం అనుకుంటే తప్ప శక్తి సామర్థ్యాలకు ఎలాంటి పరిమితులు లేవని చెప్పారు. అందుకు సమాజానికి మీరే ఉదాహరణ అని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున దివ్యాంగులకు సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం కోసం అంబేడ్కర్ భవన్, కలెక్టరేట్ లో ర్యాంపు సౌకర్యం ఏర్పాటు చేయుటకు తక్షణ చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో దివ్యాంగ బాల బాలికలు ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు. దివ్యాంగులకు బ్యాంకు రుణాలు మంజూరు ఉంటుందన్నారు. దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం అందించాలన్నారు. వేడుకలలో భాగంగా బన్ను, వికాస్, లిటిల్ ప్లవర్ స్కూల్, స్పందన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమం ముగింపు సందర్భంగా వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగులకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలతో పాటు మెడల్స్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో మేన శ్రీను, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఇసంపెల్లి జోనా, డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, కేయూ పాలకమండలి సభ్యులు డాక్టర్ కె.అనితా రెడ్డి, విద్యా ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ల మహేందర్, దివ్యాంగ సంఘం ప్రతినిధులు రాజు, శ్రీనివాస్, సిడిపివో విశ్వజ, ఎఫ్ఆర్వో రవి కృష్ణ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్చార్జి అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ భాస్కర్, పోషణ అభియాన్ కో ఆర్డినేటర్ సుమలత, తదితరులు పాల్గొన్నారు.
