* ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు
* నేడు నల్గొండలో కేటీఆర్, ఖమ్మంలో హరీశ్‌రావు ప్రచారం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. తమ ఖాతాలో వేసుకుని బలం నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన మల్లన్నకు ఈసారి అధికార పార్టీ టికెట్ దక్కడంతో బలం పెరిగింది. సిట్టింగ్ స్థానం కావడం, కాంగ్రెస్ వైఫల్యాలపై ఫోకస్ పెట్టడం, సిబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వ్యక్తులు కూడా మద్దతు ఇవ్వడంతో బీఆర్ ఎస్ అభ్యర్థి ఉత్సాహంలో ఉన్నారు. మోదీ మేనియా కలిసిసొస్తుందని, గెలిచేది తానేనని బీజేపీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికివారు పట్టభద్రులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి మద్దతుగా పార్టీ అధినేతలు రంగంలోకి దిగారు. ప్రధానంగా బీఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి వెనుకుండి మంత్రాంగం నడుపుతున్నారు. కాగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంది. రేపటితో ప్రచారం ముగియనుండడంతో ఇవాళ నల్గొండలో కేటీఆర్, ఖమ్మంలో హరీష్‌రావు పర్యటించనున్నారు.
——————–