* లోక్సభలో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఆగ్రహం
* కేంద్రం సమాధానం ఇవ్వాలని డిమాండ్
* విశ్వవిద్యాలయల్లో డ్రగ్స్ వినియోగంపై ఆందోళన
ఆకేరు న్యూస్, వరంగల్ :
బేటీ బచావో.. బేటీ పఢావో అంటూ ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బాలికల భద్రత విషయంలో ఏం చేస్తోందని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో లోకసభలో ఆమె ఈఅంశంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల ఒడిశాకు చెందిన దళిత మహిళా, తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ చదువుతున్న విద్యార్థినిని అవమానకరంగా వేధింపులకు గురిచేయడంతో ఆమె చదువు మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె లోక్సభలో ప్రస్తావించారు. దేశంలోని విద్యాసంస్థల్లో బాలికలు, మహిళా విద్యార్థులపై ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బేటీ పడావో అన్న నినాదం పాఠశాల గోడలకే పరిమితమా? విద్యాలయాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న యువతులకు రక్షణ ఎక్కడ? అని కడియం కావ్య కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో విద్యా సంస్థల్లో మహిళల భద్రతను కాపాడే వ్యవస్థలు ఎంత వరకు పనిచేస్తున్నాయో తెలియజేయాలన్నారు.
న్యాయం చేయాలి… జవాబు ఇవ్వాలి..
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మరో ముఖ్య అంశాన్ని కూడా సభ దృష్టికి తీసుకెళ్లారు. వివిధ రాష్ట్రాల్లో, ప్రత్యేకించి విశ్వవిద్యాలయల్లో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరుగుతున్నదని ఎంపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఈ ప్రమాదకర ధోరణిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కావ్య అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇవ్వకపోవడంతో ఆమెతో పాటు పలువురు సభ్యులు “న్యాయం చేయాలి… జవాబు ఇవ్వాలి” అని డిమాండ్ చేస్తూ సభలో నిరసన వ్యక్తం చేశారు. దళిత మహిళా స్కాలర్పై జరిగిన ఘటనపై ప్రభుత్వం స్పందించాలని, మహిళా విద్యార్థుల భద్రతకు బలమైన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఎంపీ డా. కడియం కావ్య స్పష్టం చేశారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
