* మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో హత్యలు చేసే సంస్కృతిని తాము వచ్చాక పదేళ్ల పాటు రూపుమాపామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ మొదలయ్యాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadeesh reddy) అన్నారు. ఆరు నెలల క్రితమే కాంగ్రెస్ (Congress) పార్టీ అంతర్గత తగదాలతో ఒక హత్య జరిగిందని, పోలీసుల నిర్లక్ష్యంవల్లే హత్య జరిగిందని తాను ఆ రోజే చెప్పానని అన్నారు. అయినా నిర్లక్ష్యం వీడకపోవడంతో ఈరోజు ఇంకో హత్య జరిగిందని మండిపడ్డారు. హత్యలు చేసే సంస్కృతి కాంగ్రెస్కు ఎప్పటి నుంచో ఉందని విమర్శించారు. మేం పదేళ్లలో ఆ సంస్కృతిని రూపుమాపడానికి ఎంతో కృషి చేశామని అన్నారు. హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి పార్టీ తరపున తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి కేటీఆర్ (Ktr) వస్తా అన్నారని, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల వేళ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీస్తుందని తామే వద్దన్నామని తెలిపారు. ఎన్నికలు ముగిశాక కేటీఆర్ పరామర్శిస్తారని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
……………………………………………..
