* పరువు తీస్తున్న కొందరు ఖాకీలు
* పోలీసు బాస్‌లు హెచ్చరిస్తున్నా మారని తీరు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఆయనో ఏసీపీ. ఇన్స్పెక్టర్లకు, సిబ్బందికి ఆదర్శంగా ఉండి.. వారు దారి తప్పితే చర్యలు తీసుకోవాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తి. కానీ.. ఆయనే దారి తప్పాడు. ఫలితంగా సస్పెన్షన్ కు గురయ్యాడు. తాజాగా కుల్సుంపుర ఏసీపీ మునావర్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. భూ వివాదాలు, కేసుల తారుమారు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. పోలీస్ స్టేషన్ల వారీగా వసూళ్లకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. కింది స్థాయి సిబ్బందితో అవమానకరంగా ఉంటారని కూడా. ఆయా ఆరోపణలు, ఫిర్యాదులపై అంతర్గత విచారణ చేపట్టిన సీపీ సజ్జనార్ ఆయనపై చర్యలు తీసుకున్నారు. అవినీతి ఆరోపణలతో మహంకాళి ఏసీపీ ఎస్.సైదయ్య ను కూడా కార్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. వీళ్లే కాదు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, నేరాలు కూడా రుజువైన సిబ్బంది పోలీసు శాఖలో చాలా మందే ఉన్నారు.
హెచ్చరికలు బేఖాతర్
అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన అధికారుల తీరు మార్చుకోవాలని పోలీసు బాస్‌లు హెచ్చరిస్తున్నా కొందరు తీరు మారడం లేదు. కంచె చేనుమేస్తున్న చందంగా కొందరు వ్యవహరిస్తున్నారు. సొమ్ములు ఇస్తే కేసులను తారుమారు చేస్తున్నారు. మరొకరు చోరీ కేసుల్లో రికవరీ చేసిన సొత్తును కాజేస్తున్నారు. అలాంటి వారిపై సీపీ సజ్జనార్ కొరడా ఝలిపిస్తున్నారు. కొందరు కిందిస్థాయి సిబ్బంది చేస్తున్న పనులతో పోలీస్ శాఖకు చెడ్డ పేరు వస్తోంది. రికవరీ సొత్తును బాధితులకు అందించాల్సిన పోలీసులే కాజేసి పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసైన అంబర్‌పేట ఎస్ఐ భానుప్రకాష్‌రెడ్డి అప్పులపాలై.. రివకరీ చేసిన 5తులాల బంగారు నగలు, తుపాకీ తాకట్ట్టు పెట్టాడు. గ్రూప్-2 ఉద్యోగం రావడంతో రిలీవ్ కోసం యత్నించిన సమయంలో తుపాకీ పోయిందని చెప్పాడు. దర్యాప్తులో సదరు ఎస్ఐ రికవరీ చేసిన బంగారునగలు తాకట్టు పెట్టినట్లు తేలింది.
కొందరు ఇన్స్పెక్టర్లు కూడా.
కుల్సుంపుర ఠాణా సీఐ సునీల్‌ను మూడు రోజుల క్రితం సీపీ సస్పెండ్ చేశారు. సీఐ సునీల్ ఓ కేసులో నిందితుల పేర్లు మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులకు అనుకూలంగా వ్యవహరించాడని సీపీ దృష్టికి వచ్చింది. దీనిపై పోలీసులు అంతర్గత విచారణ చేపట్టారు. డబ్బులు తీసుకొని నిందితుల పేర్లు మార్చారని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్‌లో టప్పాచబుత్రా సీఐ అభిలాష్ ను సస్పెండ్ చేశారు.
కింది స్థాయి సిబ్బంది వరకు..
ఐపీఎస్ అధికారినంటూ పలువురిని మోసం చేసిన కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్(39)ను ఫిలింనగర్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అతడి ఇంట్లో తనిఖీ చేసిన కానిస్టేబుల్ శ్రీరాముల శరణ్‌కుమార్ నకిలీ రాడో వాచ్ చోరీ చేశాడు. ఈ ఘటన రికార్డు కావడంతో, పోలీసు అధికారులు వాచ్ స్వాధీనం చేసుకొని కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. మెహిదీపట్నం పోలీస్టేషన్లో చోరీ కేసులో పోలీసులు రికవరీ చేసిన రూ.1.75 లక్షల విలువైన సెల్ ఫోన్‌ను లాకర్లో భద్రపరచగా పోలీసు డ్రైవర్ శ్రవణ్‌కుమార్ కాజేశాడు. ఉన్నతాధికారులు అతడిని ప్రశ్నించగా.. దొంగతనం చేసినట్లు అంగీకరించాడు.
దొంగలతో బేరసారాలు
కొంతమంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు దొంగలతో దోస్తీ చేసి బేరసారాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లోపాయికారికంగా దొంగలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చోరీ, స్నాచింగ్ కేసుల్లో పట్టుబడిన దొంగలతో దర్యాప్తులో భాగంగా పరిచయం పెంచుకుని వారితో టచ్‌లో ఉంటున్నారు. చోరీ కేసుల్లో వాటాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సదరు దొంగలు వేరే కేసుల్లో అరెస్టయినా వారికి బెయిల్ ఇప్పించడం, ఆర్థిక సాయం చేస్తూ పరోక్షంగా సహకరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిపై పోలీసు బాస్‌లు చర్యలు తీసుకుంటున్నారు. తమ దృష్టికి ఫిర్యాదులు వస్తే వెంటనే వాటిపై అంతర్గత విచారణ జరుపుతున్నారు. అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే.. ఏసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఎవరినీ ఉపేక్షించడం లేదు.
…………………………………………………
