* సైబరాబాద్ పోలీసుల ప్రకటన
* వివరాలకు కాంటాక్ట్ 94906 171317
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీజ్ చేసిన వాహనాలను వేలం వేసేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధం అవుతున్నారు. నోటీసులు పంపినా, సమాచారం ఇచ్చినా స్పందించని యాజమాన్యాలకు చెందిన వాహనాలను వేలం వేయనున్నట్లు ప్రకటించారు. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలతో పాటు వదిలేసి వెళ్లిన, ఎవరూ క్లెయిమ్ చేయని 119 వాహనాలు ఇందులో ఉన్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీస్ చట్టం-2004 సెక్షన్ 6(2),7తో పాటు, హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం సెక్షన్ 39,40,41 ప్రకారం ఈ వాహనాలను వేలం వేయడానికి అధికారిక అనుమతి ఉందని ప్రకటనలో పోలీసులు తెలిపారు. ఈ వాహనాలపై ఎవరికైనా యాజమాన్య హక్కులు, లేదా ఇతర అభ్యంతరాలు ఉన్నట్లయితే, ఈ ప్రకటన విడుదలైన తేదీ నుంచి ఆరు నెలల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు లోగా స్పందించని వాహనదారుల వాహనాలను బహిరంగ వేలం వేస్తామని స్పష్టం చేశారు. మొయినాబాద్, బౌరంపేట్ ప్రాంగణాల్లో ఉన్న వాహనాల వివరాలకు కోసం మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆర్ఐ ఎన్. వీరలింగంను సంప్రదించాలని, మరిన్ని వివరాలకు ఫోన్ నంబరు: 94906171317ను సంప్రదించవచ్చని తెలిపారు. పూర్తి వివరాలు సైబరాబాద్ పోలీస్ అధికారిక వెబ్సైట్ (https://www.cyberabadpolice.gov.in/ )లో అందుబాటులో ఉన్నాయని ప్రకటనలో తెలిపారు.
……………………………………….
