ఆకేరు న్యూస్, ములుగు: ప్రస్తుతం జరగబోయే మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు అమ్మవార్ల గద్దెలను సునాయాసంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకునే విధంగా మాస్టర్ ప్లాన్ ఏర్పాట్లు అనుకూలంగా ఉండే విధంగా పనులు సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. శుక్రవారం ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను,జంపన్న వాగు వద్ద పనులను రాష్ట్ర మంత్రులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ , ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి,పూజారులు, ఆర్ అండ్ బి, ఇంజనీరింగ్ , పోలీసు అధికారులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….

