ఆకేరున్యూస్ డెస్క్ : మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వ మహిళా పొదుపు సంఘాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు నడుము బిగించింది. ఇటువంటి మహిళా పొదుపు సంఘంలో ఇప్పుడు నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల కిస్తీలను ప్రతినెల చెల్లిస్తుండగా.. సంఘ సభ్యులు ఇచ్చే రూ.500 నోట్లలో నకిలీవి దర్శనం ఇస్తున్నాయి. వేములవాడ పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు టీమ్ లీడర్‌కు తమ ఈఎంఐలకు సంబంధించిన నగదును అప్పగించారు. సంఘం సభ్యులు ఇచ్చిన ఆ డబ్బును సదరు లీడర్ తీసుకుని నిన్న బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లగా అందులో నకిలీ నోటు బయటపడిరది. ఇలాగే గతంలో రెండుసార్లు నకిలీ నోటు వచ్చిందని ఇది మూడోసారి అంటూ గ్రూప్ సభ్యులు తెలిపారు. దీంతో మహిళా పొదుపు సంఘాలలో నకిలీ నోట్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పొదుపు సంఘాలు ఉన్న నేపథ్యంలో నకిలీ నోట్ల విషయంలో గ్రూప్ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.
……………………………………….

