* ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పొరపాట్లకు తావు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు. సోమవారం వెంకటాపురం, వాజేడు, ఎంపీడీవో కార్యాలయాల్లో, కన్నాయిగూడెం రైతు వేదికలో వేరు వేరుగా మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మండల ప్రత్యేక అధికారి, తహసిల్దార్, ఎంపీడీవో, ఎంపీఓ, జోనల్ ఆఫీసర్స్, ఆర్వోలు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్( స్థానిక సంస్థలు )సంపత్ రావు తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంలలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిబంధనలు పాటిస్తూ ఎన్నికల విధులు నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికారుల ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేసి, పోలింగ్ డే రోజున ఎలాంటి లోపాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని , అధికారులు విధులకు గైహాజరైతే చర్యలు తీసుకుంటామని, పోలింగ్ సిబ్బంది చెక్ లిస్ట్ ప్రకారం ఓటింగ్ మెటీరియల్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అన్నారు. సర్పంచ్, వార్డు మెంబర్ బ్యాలెట్ పేపర్స్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ కౌంటింగ్ పూర్తయిన వెంటనే సిబ్బంది జాగ్రత్తగా సీల్ వేసి సామాగ్రిని డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాలలో సిగ్నల్ అందుబాటులో ఉన్న పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్నామని, సిగ్నల్ అందుబాటులో లేని పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ ద్వారా మైక్రో అబ్జర్వర్ పరిశీలనలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది ఉదయం 10 గంటల వరకు పంపిణీ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పంపిణీ. కేంద్రాల్లో మెటీరియల్ తీసుకున్న సిబ్బంది కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని 17వ తేదీన ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుండిమధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని తెలిపారు. తదుపరి ఖచ్చితంగా మధ్యాహ్నం 2గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. అన్ని పోలింగ్
కేంద్రాలలో వీల్ చైర్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 2 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్లు లెక్కింపు ఆలస్యం జరిగితే తెలియచేయాలని, ఆలస్యానికి కారణాలు తెలియచేస్తూ ఎన్నికల సంఘానికి తెలియచేయాల్సి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే సాధారణ ఎన్నికల పరిశీలకుల అనుమతితో డిక్లర్ చేయాలని తెలిపారు. ప్రజలందరూ ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా గ్రామాభివృద్ధి కోసం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం కలెక్టర్ వాజేడు మండల కేంద్రం లోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లోని పోలింగ్ సామాగ్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు ఎంపీడీవోలు, ఎంపీఓలు, జోనల్ ఆఫీసర్స్, ఆర్వోలు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

……………………………………………

