* మంత్రులతో సీఎం రేవంత్ ఆరా
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తే ఎలా ఉంటుందని మంత్రులను ఆరా తీస్తున్నట్టు సమాచారం. నెలాఖరున అసెంబ్లీ నిర్వహించి రెండు లేదా మూడు రోజులు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్టు టాక్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు తొలి సమావేశాన్ని 2023 డిసెంబర్ 9న ఏర్పాటు చేశారు. 2024లోనూ డిసెంబర్ 9న సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది సైతం అదే రోజున అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనుకున్నా.. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కారణంగా సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే నెలాఖరున నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం ఆరా తీస్తున్నట్టు సమాచారం. రెండేండ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించిన సమాచారాన్ని శాఖల వారీగా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆర్థిక, వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, విద్య, మున్సిపల్, పరిశ్రమలు, సంక్షేమ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేసే పనిలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. ఈ నెల 18న ఎన్నికల కోడ్ ముగియనుండటంతో ఆ వెంటనే రెండు మూడు రోజుల వ్యవధిలో కేబినెట్ సమావేశం నిర్వహించి పలు పెండిరగ్ అంశాలకు ఆమోదం తెలిపే అవకాశముంది. దీనితో పాటుగా సర్పంచ్ ఎన్నికల ఫలితాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రైతు భరోసా నిధుల అన్నదాతల ఖాతాల్లో జమచేసే తేదీలు, తదితర విషయాలపై చర్చించే అవకాశం ఉన్నది.
…………………………………..

