ఆకేరు న్యూస్ డెస్క్ : సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఢిల్లీతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. దేశ రాజధానిలోని 7 స్థానాలు, హరియాణలోని మొత్తం 10 సీట్లకు ఈ విడతలోనే ఎన్నికలు జరగనుండడంతో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను లిక్కర్ కేసులో జైలుకు పంపిన నేపథ్యంలో ఢిల్లీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠ గా మారింది. ఇదే సమయంలో పార్టీ ఎంపీ స్వాతి మలీవాల్ తనపై సీఎం నివాసంలోనే దాడి జరిగిందని ఆరోపించడం, ఈ కేసులో కేజ్రీ పీఏ విభవ్ అరెస్టు కావడంతో ఎన్నికలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఆరో దశలో యూపీలోని 14, పశ్చిమబెంగాల్, బిహార్‌లో 8 స్థానాల చొప్పున, ఒడిసాలో 6, జార్ఖండ్‌లో 4, జమ్ముకశ్మీర్‌లో ఒక్కో నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. వీటిలో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 11.13 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఒడిసాలోని 42 అసెంబ్లీ సీట్లకు కూడా ఈరోజే ఓటింగ్ జరగనుంది.
పోటీలో ఉన్న ప్రముఖులు
బీజేపీ అభ్యర్థులు, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ఇంద్రజీత్ సింగ్, క్రిషన్‌పాల్ గుర్జర్, మనేకా గాంధీ, సంబిత్ పాత్రా, మనోహర్‌లాల్ ఖట్టర్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నేతలు దీపేందర్‌సింగ్ హుడా, రాజ్ బబ్బర్ తదితరులు ఈ విడతలో పోటీలో ఉన్న ప్రముఖులు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఢిల్లీలోనే ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
————————