– ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్, బిజెపి,బీఆర్ఎస్ నేతలు.
– గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతం – సర్పంచులు
– ఫస్ట్ టైం సర్పంచ్‌లకు సవాళ్లు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండలంలో ని 24 గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీల పాలకవర్గాలు కొలువుదీరాయి.ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో వార్డు సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్‌లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రత్యేక అధికారులు నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపి, గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలు కొత్త కళను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా సర్పంచులు గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేల కృషి చేస్తామన్నారు. కాగా సర్పంచ్ల ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ నేతలు హాజరై నూతన గ్రామపంచాయతీ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రమాణ స్వీకారానికి హాజరైన కాంగ్రెస్ నేత వొడితల ప్రణవ్
నూతనంగా కొలువుదిరిన ఉప్పల్ మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు. ఉప్పల్ గ్రామ సర్పంచ్ రమ, ఉపసర్పంచ్ మేడిపల్లి సిద్ధార్థ లను శాలువాతో సన్మానించి,నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని,సమస్యలపై ఈ ప్రాంత బిడ్డగా, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఎక్కువ నిధులు కేటాయిస్తామని, గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అనేక సంక్షేమ అభివృద్ధి జరిగిందనీ, గ్రామాల్లో కూడా అదే రకమైన పాలన కొనసాగించాలని అన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
మండలంలో అత్యంత ఆసక్తి కలిగిన గ్రామపంచాయతీ ఎన్నికగా ఉప్పల్ పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు చర్చనీయాంశమయ్యాయి. సర్పంచ్ గా ర్యాకం శ్రీనివాస్ ఎన్నిక కాగా నేడు ప్రమాణ స్వీకారానికి, మండల ఎంపీడీవో గుండె బాబు, కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. సర్పంచ్, వార్డ్ మెంబర్ల ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ… ఉప్పల్ పల్లి గ్రామాన్ని అందరి సహకారంతో ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని అన్నారు.
ఫస్ట్ టైం కొత్త సర్పంచ్‌లకు సవాళ్లు
కమలాపూర్ మండల వ్యాప్తంగా ఫస్ట్ టైం సర్పంచ్ లే ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ అభివృద్ధి చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చిన వాళ్ళకి, 22 నెలలు గా పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు నిలిచిపోయాయి. నేడు పంచాయతీల్లో కొలువు తీరిన కొత్త పాలకవర్గాలకు గ్రామల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు కొత్త సర్పంచ్‌లకు సవాల్‌గా మారనుండగా వాటిని ఎలా పరిష్కరిస్తారోనని ప్రజలలో చర్చ జరుగుతోంది.

……………………………………………………………

