* రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళన
* న్యాయం చేస్తాం : మంత్రి పొంగులేటి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వర్కింగ్ జర్నలిస్టుల మధ్య విభజన వద్దని, అక్రిడిటేషన్ కార్డుల జారీలో వివక్ష చూపొద్దని డెస్క్ జర్నలిస్స్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఈరోజు ఆందోళనలు చేపట్టింది. అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. జీవో 252ను వెంటనే సవరించాలని, డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా డీజేఎఫ్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఉపేందర్, మస్తాన్ మాట్లాడుతూ.. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు కలిస్తేనే జర్నలిజం అవుతుందని, ఇన్‌ఫుట్ – ఔట్‌ఫుట్ రెండూ ఉంటేనే మీడియా పరిపూర్ణం అవుతుందని అన్నారు. డెస్క్ జర్నలిస్ట్ లను సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా మార్చే ప్రయత్నం విరమించుకోవాలని కోరారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అర్ధరాత్రి వరకు పని చేస్తున్న డెస్క్ జర్నలిస్టులకు అక్రమిడిటేషన్లు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. హైదరాబాద్ తోపాటు, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, ఖమ్మం అన్ని జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి.
పరిష్కరిస్తా : పొంగులేటి హామీ
డెస్క్ జర్నలిస్టుల సమస్యను పరిష్కరిస్తానని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మహబూబాబాద్ లోని నూకల రామచంద్రారెడ్డి స్మారక విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉండగా టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ నేతృత్వంలో డీజేఎఫ్ టీ నేతలు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను జారీ చేయాలని, మీడియా కార్డుల పేరుతో వర్కింగ్ జర్నలిస్టును విభజించవద్దని వినతిపత్రం సమర్పించారు. అలాగే డెస్క్ జర్నలిస్టుల సమస్యల్ని దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
…………………………………………………………

