* అధికారుల సమన్వయం తో జాతర విజయవంతం చేయాలి
* రాష్ట్రమంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగేలా జాతర నిర్వహిస్తామని, జాతర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని, అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం తాడ్వాయి మండలం కాల్వపల్లి నుండి ఊరట్టం వరకు రహదారి పనులను , కల్వర్టు నిర్మాణ పనులను, ఊరట్టం – కొండాయి రహదారిని పనులను, కల్వర్టు నిర్మాణాన్ని , ఆలయ ప్రాంగణం ఫ్లోరింగ్ పనులను,రాష్ట్ర మంత్రి సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా లతో కలిసి పరిశీలించారు. అనంతరం మేడారం హరిత హోటల్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మేడారం జాతర అభివృద్ధి పనులను శాఖల వారీగా కూలంకషంగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ షిఫ్ట్ ల వారిగా సిబ్బందిని ఉపయోగిస్తూ యుద్ధ ప్రతిపాదికన పడలను పూర్తి చేయాలని, అధికారులు చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. గత జాతర కంటే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
జాతర సమయంలో రెప్పపాటు సమయం కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, తాడ్వాయి, పసర మేడారం చుట్టుపక్కల 10 గ్రామాల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని జాతరకు వచ్చే రహదారులకు ఇరువైపులా బోర్ వెల్స్ చేతి పంపులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జాతర సమయంలో క్యూలైన్స్ పాత్ర కీలకంగా ఉంటుందని, క్యూలైన్స్, షేడ్స్ నిర్మాణాలలో వేగం పెంచాలని అన్నారు. ములుగు ఘట్టమ్మ వద్ద నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు కూడా త్వరితగతిని పూర్తి చేయాలని కొత్తూరు నార్లపూర్ రహదారి పనులు, గోవిందరాజుల పూజారుల కోసం ఊరట్టo వద్ద నిర్మిస్తున్న వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులు యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేయాలని అన్నారు.
ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకు జాతర అనంతరం కూడా వచ్చే భక్తులకు నిరంతరం వైద్య సదుపాయాలు అందించాలని, జాతరకు వచ్చే రహదారుల జంక్షన్ లలో కూడా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, పార్కింగ్ స్థలాలు, ములుగు గట్టమ్మ వద్ద ఫీడింగ్ రూమ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి, ఆర్డీవో వెంకటేష్ , డి.ఎస్.పి రవీందర్ ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

………………………………………………………………….

