* శాసనసభలో చర్చకు ముందే వేడి
* కొద్ది రోజుల క్రితం కేసీఆర్.. తాజాగా రేవంత్
* నీటిపై మాటల యుద్ధం
* నేడు దద్దరిల్లనున్న సభ
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
రాష్ట్రాలు.. రాష్ట్రాలు మధ్య సాగే నీటి పోరు తెలంగాణలో అందుకు విరుద్ధంగా రాష్ట్రంలోనే అధికార, విపక్షాల మధ్య సాగుతోంది. మీ వల్లే నష్టం జరిగిందంటే.. మీ వల్లే అంటూ.. అధికార, విపక్ష నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో, నీటి కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణకు ద్రోహమే చేసిందని మరోసారి నిప్పులు చెరిగారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రాజెక్టులో జరిగిన జాప్యం, నిధుల వినియోగం, సాంకేతిక అంశాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే కేసీఆర్ కు సవాల్ విసిరారు. తాజాగా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
కౌంటర్.. ఎన్ కౌంటర్..
నదీ జలాల అంశాలు, కేసీఆర్ చేసిన ఆరోపణలపై నిన్న (గురువారం) ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చచ్చిపోయిన బీఆర్ ఎస్ పార్టీని లేవనెత్తేందుకు కేసీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, ఆయనది సంకుచిత స్వభావమని అన్నారు. పదేళ్ల బీఆర్ ఎస్ హయాంలోనే నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి తెస్తున్నామని చెప్పుకొచ్చారు. గతంలో కేసీఆర్, హరీశ్‌రావు చేసిన సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు వారిద్దరినీ ఉరేసినా పాపం లేదని సంచనల వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి ఆ ప్రాజెక్టును మార్చారని మండిపడ్డారు. తల వదిలేసి తోక దగ్గర నీళ్లు తెచ్చేలా ప్రాజెక్టు డిజైన్ చేశారని విమర్శించారు. ఏపీకి 66శాతం నీళ్లు శాశ్వత హక్కు వచ్చేలా కేసీఆర్ సంతకం చేశారని ధ్వజమెత్తారు.
ఇప్పుడు అసెంబ్లీలో..
అసెంబ్లీ బయట అధికార, ప్రతిపక్ష అగ్రనేతల వ్యాఖ్యలు ఇలా ఉన్న తరుణంలో నేడు అసెంబ్లీలోనే దీనిపై చర్చ పెడుతుండడం ఆసక్తిగా మారింది. కృష్ణా నది జలాల వాటాలు.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలపై శుక్రవారం చర్చ పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. చర్చలో కృష్ణ జలాల హక్కుల సాధన, ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ప్రతిపక్షం, వారి ఆరోపణలను తిప్పి కొట్టాలని అధికార కాంగ్రెస్ అస్త్రశస్త్రాలు కూడగట్టుకుని రెడీగా ఉన్నాయి. రెండు వర్గాలు కూడా నీళ్ల లెక్కలతో కుస్తి పడుతూ రేపటి సభా సమరానికి సంసిద్దమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై అవగాహన కల్పించినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే గురువారం సాయంత్రం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
దద్దరిల్లుడు ఖాయమేనా?
కేసీఆర్ ప్రధానంగా టార్గెట్ చేసిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రతిపాదన దశ నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలు, బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, పనుల పురోగతి, గత రెండేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి తదితర అంశాలపై కాంగ్రెస్ సభ్యులకు వివరించారు. కృష్ణా జలాల పంపిణీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందనే పాయింట్ మీదనే చర్చను కేంద్రీకరించాలని అధికార పక్షం వ్యూహరచన చేస్తోంది. అందుకు దీటుగా ప్రతిపక్షం కూడా సిద్ధంగా ఉంది. కృష్ణా జలాల హక్కులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా బనకచర్ల నల్లమల సాగర్ వంటి కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై చర్చించేందుకు మాజీ మంత్రి హరీశ్ సిద్ధమయ్యారు. నేడు జరిగే చర్చలో ఆయనే కీలకం కానున్నారు. ఈక్రమంలోనే అధికార, ప్రతిపక్ష నీటి వాటాలపై ఈరోజు చర్చ జరగనుండడంతో శాసనసభ సమావేశాలు ఆసక్తిగా మారాయి.
………………………………………………

