* మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు కీలకనేత బర్సె దేవాతో పాటు 20 మంది లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వివరించారు. లొంగిపోయిన వారిలో గెరిల్లా ఆర్మీ ముఖ్య నాయకుడు బడ్సే సూక్కా అలియాస్ దేవాతో పాటు తెలంగాణకు చెందిన రాజిరెడ్డి, అతని భార్య.. ఇద్దరూ లొంగిపోయారని తెలిపారు. హిడ్మా సొంత గ్రామానికి చెందిన వ్యక్తి దేవా అని.. ఎన్ఐఏ నుంచి దేవా పైన రూ. 75 లక్షల రివార్డ్ ఉందని చెప్పారు. ఆవులం సోమా, భేమే, సుశీల, వేముల రాజు, నందయ్య, మంకు, అండా ఇలా మొత్తం 20 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి 2ఎల్ఎంజీ, అమెరికన్ మేడ్ కోల్ట్ గన్, ఇజ్రాయెల్ మేడ్ టవర్ వేపన్, 8 ఏకే47 గన్స్, 8 ఎస్ఎల్ఆర్ వెపన్స్, 4 బ్యారెల్ గ్రానైడ్ లాంచర్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వివరించారు. ఇక పీఎల్జీఏ బెటాలియన్లో 400 మందికి పైగా మావోయిస్టులు ఉండేవారని.. ఇప్పుడు వారి సంఖ్య 66కు చేరిందన్నారు డీజీపీ. ఈ సంఖ్యను బట్టిచూస్తే పీఎల్జీ పూర్తిగా క్షీణించినట్లు అర్థమవుతోందన్నారు. రాజిరెడ్డి లొంగుబాటుతో ఇంకా ఒక్కరు మాత్రమే తెలంగాణ స్టేట్ కమిటీ వారు మావోల్లో మిగిలారని వివరించారు. సీఎం పిలుపుతో మావోయిస్టులు లొంగిపోతున్నారని డీజీపీ తెలిపారు. డివిజన్ సభ్యులకు రూ. 5 లక్షలు, ఏరియా సభ్యులకు రూ. 4 లక్షలు, మిగతా సభ్యులకు రూ. 1 లక్ష రివార్డు అందజేస్తున్నట్లు తెలిపారాయన. మొత్తంగా లొంగిపోయిన వారికి రూ. 1.80 కోట్లు రివార్డు అందిస్తామన్నారు. తక్షణ సాయంగా రూ. 1 లక్షల చొప్పున ఇస్తున్నట్లు డీజీపీ తెలిపారు.ఇప్పటి వరకు 576 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు.
…………………………………………

