* తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన మంత్రి
ఆకేరు న్యూస్, ములుగు: జాతరలో పిల్లలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక సూచనలు చెయాలని,
తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక మిస్సింగ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆదివారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద జరుగుతున్న పనులను మరియు హరిత హోటల్ క్రాస్ వద్ద జరుగుతున్న సర్కిల్ సుందరీకరణ పనులను అలాగే ఊరట్టం క్రాస్ వద్ద సుందరీకరణ పనులను, జంపన్న వాగు వద్ద దుస్తులు మార్చుకునే గదులు, స్నాన ఘట్టాల వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తో మంత్రి సీతక్క పరిశీలించారు.
మేడారం జాతర పర్యటనలో భాగంగా జంపన్న వాగు వద్ద జాతర పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో మంత్రి సీతక్క మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. వాగు సమీపంలో ఒక చిన్నారి తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి ఉన్నట్లు గమనించిన మంత్రి సీతక్క, వెంటనే ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ఆమె తల్లిదండ్రులను గుర్తించేందుకు అధికారులను కోరారు. మంత్రి ఆదేశాల మేరకు స్పందించిన అధికారులు తక్షణమే చిన్నారి తల్లిదండ్రులను గుర్తించారు. అనంతరం ఆ చిన్నారిని మంత్రి సీతక్క స్వయంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన అక్కడున్న భక్తులను ఎంతగానో కదిలించింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ, మేడారం జాతరలో చిన్నపిల్లలు, వృద్ధులను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. వారిని ఎక్కడా ఒంటరిగా వదిలివేయకూడదని, ఎవరైనా తప్పిపోయినట్లయితే వెంటనే సమీపంలో ఉన్న యూనిఫాం ధరించిన పోలీస్ సిబ్బందిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే మేడారం జాతరలో తప్పిపోయిన వారి కోసం ప్రత్యేకంగా ‘మిస్సింగ్ క్యాంపులు’ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ క్యాంపుల ద్వారా తప్పిపోయిన వారిని త్వరగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. భక్తుల భద్రతే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమని, అందరూ సహకరించి జాతరను సురక్షితంగా నిర్వహించుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

…………………………………………………….

