* ఆయనకు తెలియకుండానే ఆయన శాఖ నుంచి జీవోలు
* “తెర” వెనుక రాజ్యాంగేతర శక్తి
* మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపం.. ఆయనను చూస్తే జాలేస్తోందని పేర్కొన్నారు. సంక్రాంతి బరిలో రిలీజైన సినిమా టికెట్ రేట్ల పెంపు జీవోల జారీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా రేట్ల పెంపునకు సంబంధించి హోం శాఖ పేరుతో జీవోలు వస్తాయని, సినిమా మంత్రి ఏమో తనకు ఏమీ తెలియదని, తన దగ్గరకు ఎవరూ రాలేదని అంటారని తెలిపారు. సినిమా టికెట్ రేట్లు పెంచేది సీఎం అని కోమటిరెడ్డి (Komatireddy) చెప్పకనే చెప్పారని అన్నారు. తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా..లేనట్టా అని ప్రశ్నించారు. సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? అని సీఎం రేవంత్ రెడ్డి(Revanthreddy) ని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరని, ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇచ్చి ఆలస్యంగా ప్రకటిస్తారని అన్నారు. మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా అని మండిపడ్డారు. వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుడు అనేవాడు పాలసీ తో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు (Harishrao) హితవు పలికారు.
…………………………………………………..

