* పోలీసుల కంటపడకుండా ప్రణాళికలు
* జోరుగా నగర శివారు ఫామ్హౌస్ల బుకింగ్
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
సంక్రాంతి పండుగ వస్తోందంటే కోడి పందాలకు ఫేమస్ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చాలా మంది పందాలు ఆడేందుకే అక్కడకు వెళ్తుంటారు. పిఠాపురంలో ఇటీవల సంక్రాంతి సంబరాలు ప్రారంభించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పండుగ వస్తోందంటే ఎక్కడికి వెళ్తున్నారని కొందరు సన్నిహితులను అడిగితే భీమవరం కోడి పందాలకు అని చెప్పేవారని వ్యాఖ్యానించారు.
సిటీలోనూ పందెం కోళ్లు
పండుగ అంటే కోడిపందాలు, జూదాలు కాదని వాటిని భోగి మంటల్లో పడేయాలని సూచించారు. ఇలాంటి సూచనలు చాలా మంది ప్రముఖులు ఎప్పటి నుంచో చేస్తున్నా, కోర్టు నిషేధాజ్ఞలు ఉన్నా సంక్రాంతి అంటే కోడిపందాలు.. కోడిపందాలు అంటే సంక్రాంతి అనే విధాంగా ఏపీలో పరిస్థితి మారిపోయింది. సంక్రాంతి రోజుల్లో హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అందరూ సొంతూళ్లకు వెళ్లిపోతుంటారు. అయితే.. నగరంలోనూ కోడిపందాలు నిర్వహించడం కొన్నేళ్లుగా నడుస్తోంది. ఈసారి కూడా పందాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంజాయ్కు రెడీ
పోలీసులకు చిక్కకుండా ఫ్యామిలీ దావత్ పేరుతో కొందరు ఈ పందాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగర శివారు ప్రాంతాలైన కీసర, హయత్నగర్, మహేశ్వరం, మోయినాబాద్ తదితర ప్రాంతాల్లో పందెం కోళ్లను పెంచుతున్నారు. సంక్రాంతి పండుగ ప్రారంభంలో లక్షలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్న బెట్టింగ్ రాయుళ్లు వాటిని ఇక్కడి నుంచే ఆంధ్రాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోనూ సంక్రాంతి సంబరాలను నిర్వాహకులు జోరుగా కొనసాగిస్తున్నారు. ఏపీలోని సంబురాలకు ఏ మాత్రం తీసిపోకుండా కోళ్ల పందాలు, పేకాట శిబిరాలు, పార్టీలు వంటివి నిర్వహించి ఎంజాయ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
వాట్సప్ గ్రూపుల్లో..
కోడిపందాలకు సంబంధించిన సమాచారం కొద్ది రోజులుగా వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వాటిని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగారు. ఎవరికీ అనుమానం రాకుండా వాట్సాప్ గ్రూపుల ద్వారా స్నేహితులను, పేకాట రాయుల్లను ఆహ్వానిస్తారు. మద్యం సరఫరా, వివిధ రకాల వెజ్ నాన్వెజ్ భోజనాలు, ఇతర విందు వినోదాల వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిసింది. కొంతమంది నిర్వాహకులు ఆహూతుల కోరిక మేరకు కోళ్ల పందాలను సైతం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కోళ్ల పందాలు, పేకాట స్థావరాలు పోలీసుల కంటపడకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
……………………………………..

