* నిర్దేశిత మార్గం నుంచి పక్కకు..
* అంతరాయాలపై సమీక్షిస్తాం..
* కారణాలను విశ్లేషించి తర్వాత ప్రకటిస్తాం
* ఇస్రో చైర్మన్ వి.నారాయణన్
ఆకేరు న్యూస్, నెల్లూరు : ఇస్రో కీలకంగా భావించిన పీఎస్ఎల్వీ-సీ62 గతి తప్పింది. శ్రీహరికోట నుంచి ఈరోజు ఉదయం 10.18 నిమిషాలకు నింగిలోకి ఎగిరిన రాకెట్ మూడో దశ వరకూ సాఫీగానే సాగింది. ఆ తర్వాత అనుకోని అంతరాయాలతో గతి తప్పింది. ఆ రాకెట్ మోసుకెళ్తున్న 15 ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించలేదు. ఈ ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో పూర్తి కావాల్సి ఉందని, కానీ, మూడో దశలో నిర్దేశించిన కక్ష్యలోకి రాకెట్ వెళ్లలేదని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ప్రకటించారు. ఇందుకు గల కారణాలను విశ్లేషించి త్వరలోనే ప్రకటిస్తామని వెల్లించారు. ఈ రాకెట్లో డీఆర్డీవో రూపొందించిన అన్వేషతో పాటు హైదరాబాద్ కంపెనీ ద్రువ స్పేస్(Dhruva Space) తయారు చేసిన ఉపగ్రహాలు ఉన్నాయి. అన్వేష అనేది నిఘా శాటిలైట్. అడ్వాన్సడ్ ఇమేజింగ్ సామర్థ్యం ఆ శాటిలైట్‌కు ఉంది. పొదల్లో, అడవుల్లో, బంకర్లలో దాచుకున్న వారిని ఆ శాటిలైట్ తన టెక్నాలజీతో గుర్తించగలదు. ఈఓఎస్-ఎన్1 మిషన్ ను ఇస్రోకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆపరేట్ చేసింది. లాంచ్ చేసిన 15 ఉపగ్రహాల్లో ఏడు భారత్‌వి, 8 విదేశాలకు చెందినవి ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ద్రువ్ స్పేస్ సంస్థ ఏడు ఉపగ్రహాలు పంపినట్లు తెలుస్తోంది. ఇక విదేశీ ఉపగ్రహాల్లో ఫ్రాన్స్, నేపాల్, బ్రెజిల్, యూకే దేశాలకు చెందినవి ఉన్నాయి. 2026లో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది కావడం గమనార్హం.
……………………………………………………

