*ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా ల్యాండ్ స్కేపింగ్
*క్యూ లైన్ కాంప్లెక్స్ పనులు పూర్తి చేయాలి
* రాష్ట్ర మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి రానున్న నేపథ్యంలో, జాతర పనుల పురోగతిని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా బుధవారం ఆమె మేడారం గద్దల ప్రాంగణం చుట్టూ కొనసాగుతున్న ల్యాండ్‌స్కేపింగ్ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆదివాసీ–గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ల్యాండ్‌స్కేపింగ్ చేపట్టాలని అధికారులకు సూచించారు. గద్దెల ప్రాంగణంలో ఔషధ వనమూలికలు, ఇప్ప పువ్వు వంటి సంప్రదాయానికి ప్రాధాన్యమైన మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు. ఈ మొక్కలను మంత్రి సీతక్కతో పాటు జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు వివరించారు. ల్యాండ్‌స్కేపింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు.అదేవిధంగా సమీపంలో నిర్మాణంలో ఉన్న క్యూ లైన్ కాంప్లెక్స్ పనులను మంత్రి పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఈఈ పంచాయతీ రాజ్ అధికారిని మంత్రి సీతక్క ఆదేశించారు. భక్తుల సౌకర్యాల దృష్ట్యా పనుల్లో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, ఆర్ అండ్ బి ఈ ఎన్ సి, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఈ ఓ వీరస్వామి, పి ఆర్ ఈ ఈ అజయ్ కుమార్, ఆర్డీఓ వెంకటేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………….

