* తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
* దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వికలాంగుల మధ్య జరిగే వివాహాలకు అందజేస్తున్న వివాహ ప్రోత్సాహక నగదును రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఆర్థిక సహాయం భార్య పేరున నేరుగా ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో వికలాంగ దంపతులకు వివాహానంతరం ఎదురయ్యే ఆర్థిక ఒత్తిళ్లు తగ్గడంతో పాటు, నివాసం, వైద్య ఖర్చులు, జీవనోపాధి ఏర్పాట్లకు గణనీయమైన సహాయం అందనుంది. ప్రత్యేక అవసరాలు ఉన్న వికలాంగ దంపతులు గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఈ నగదు ప్రోత్సాహకం కీలకంగా మారనుంది.
ఇదీ చారిత్రాత్మక నిర్ణయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
వికలాంగుల జీవితాల్లో భద్రత, స్థిరత్వం తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల కాలంలో కేవలం పరిమిత సహాయం మాత్రమే అందిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగుల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. వికలాంగుల మధ్య వివాహాలను ప్రోత్సహించడం ద్వారా సామాజిక అంగీకారం పెరుగుతుందని, వివక్ష తగ్గుతుందని, అలాగే కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుందని మంత్రి వివరించారు. ఈ పథకం ద్వారా వికలాంగుల ఆత్మవిశ్వాసం పెరిగి, సమాజంలో వారు సమాన హక్కులతో జీవించేందుకు మార్గం సుగమమవుతుందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల కోసం పింఛన్ల పెంపు, సంక్షేమ పథకాల విస్తరణ, ఆర్థిక సహాయాల పెంపు వంటి చర్యలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. మాటల్లో కాకుండా, కార్యాచరణలో వికలాంగుల పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం స్పష్టం చేస్తోందన్నారు. అన్నిటికి మించి ఇదీ ఒక చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.
————————-

