* చార్మినార్, కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారు..
* కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూర్వకంగా వ్యవహరిస్తోంది
* చార్మినార్ వద్ద కేటీఆర్ ఆందోళన
* వరంగల్లో కూడా నిరసనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజముద్ర (Telangana State Emblem) మార్పుపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజకీయ కక్షతోనే మార్పు చేస్తోందని ఆరోపిస్తోంది. తెలంగాణ చిహ్నం మార్పును నిరసిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చార్మినార్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు మాగంటి గోపీనాథ్, పొన్నాల లక్ష్మయ్య, పద్మారావు, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చారిత్రక చిహ్నాలను చార్మినార్, కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలకు చేసిన మంచిని, పదేళ్లలో జరిగిన ప్రగతిని దేశానికి చెప్పాలి కానీ, ఇలాంటి పనులు కరెక్ట్ కాదన్నారు. కేసీఆర్ పేరు వినిపించకూడదనే కాంగ్రెస్ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ అని, అలాంటి చిహ్నాన్ని తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించడమేనని కేటీఆర్ అన్నారు. మూర్ఖపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమండ్ చేశారు.
వరంగల్లో..
తెలంగాణ లోగోలో వరంగల్ లోని కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర చిహ్నాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వినోద్ కుమార్ వెల్లడించారు.
—————–