* కీలక అధికారుల నుంచి కేసీఆర్ వరకు నోటీసులు, విచారణ
* కేసీఆర్ విచారణపైనే అందరి చూపూ!
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ సంచలనం. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపితగా బీఆర్ ఎస్ శ్రేణులు పేర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్.. నోటీసులు జారీ చేయడంతో మరింత సంచలనంగా మారింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు అనేక కీలక మలుపులు తిరుగుతోంది. వీసీ సజ్జనార్ నాయకత్వంలో మరో సిట్ ఏర్పాటు చేసిన తర్వాత దర్యాప్తు మరింత వేగవంతమైంది. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన రాజకీయ నేతలకు కూడా సిట్ అధికారులు ఈ కేసులో నోటీసులు జారీ చేయడం మొదలుపెట్టారు. కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు వంటి కీలక నేతలను ఇప్పటికే విచారణ కూడా చేశారు.
కేసీఆర్ విచారణ ఎప్పుడు?
సిట్ అంతటితో ఆగలేదు. గులాబీ బాస్ కేసీఆర్ కు కూడా నోటీసులు అందించింది. వాస్తవానికి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, మునిపల్ ఎన్నికల నామినేషన్ కు ఈరోజు ఆఖరి రోజు కావడం, తాను ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా కొన్ని విధులు నిర్వహించాల్సి ఉన్నందున విచారణకు రాలేనని కేసీఆర్ సిట్ కు బదులిచ్చారు. తనను ఎర్రవల్లిలో విచారించాలని కోరారు. దీంతో సిట్ ఆయన అభ్యర్థనను అంగీకరించింది. ఎర్రవల్లిలో విచారించే అంశంలో న్యాయనిపుణులతో చర్చించి మరో నోటీసు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈక్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసు రసకందాయంలో పడింది. కేసీఆర్ విచారణతో రెండేళ్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరుతుందనే ప్రచారం జరుగుతోంది.
వారి వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్ కు ప్రశ్నలు
ఇప్పటికే సిట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసిన సీపీ సజ్జనార్ శాఖలో మార్పులు చేర్పులు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన పోలీస్ అధికారులను విచారించి, వారిని రిమాండ్‌కు తరలించారు. ఆ తరువాత ఫోన్ ట్యాపింగ్‌లో బాధ్యులుగా ఉన్నవారిని విచారించి వారి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈరోజు లేదా రేపు కేసీఆర్ కు మరో నోటీసు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫేషన్ స్టేట్ మెంట్ లో కేసీఆర్ పేరుంది. ప్రభాకర్ రావు నియామకంలోనూ కేసీఆర్ పేరును భుజంగారావు ప్రస్తావించారు. ప్రభాకర్ రావు తరచూ ప్రగతిభవన్ వెళ్లి వచ్చేవారని భుజంగరావు తెలిపినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు, భుజంగరావు వాంగ్మూలాల ఆధారంగానే సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
అసలు ఏంటీ కేసు
గత ప్రభుత్వ హయాంలో విపక్షానికి చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో కొందరిపై ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారుల సహాయంతో అనధికారంగా ఫోన్లను వినటం / ట్రాక్ చేయటం చేశారని అభియోగాలు ఉన్నాయి. అధిక సంఖ్యలో ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, న్యాయవాదులు వంటి వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రధాన నిందితులు వీరే..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్.టి. ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా విచారణ సంస్థ పేర్కొంది. టెలిఫోన్లు ట్యాప్ చేయాలని కింది స్థాయి సిబ్బందికి ఈయన ఆదేశాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఓ టెలివిజన్ చానెల్ యజమాని శ్రవణ్ కుమార్, మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి. ప్రణీత్‌రావు, సహాయక ఎస్పీ ఎన్.భుజంగరావు, హైదరాబాదు నగర పోలీస్ శాఖలో అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న, మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి. రాధాకిషన్ రావులను ప్రధాన నిందితులుగా అధికారులు చేర్చారు.
ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న కీలక నేతలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక రాజకీయ నేతలను సిట్ అధికారులు విచారించారు. మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ దాదాపు ఏడు గంటల పాటు విచారించింది. అలాగే బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏడు గంటల పాటు విచారించారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు ను అధికారులు విచారించారు. కాగా, ఈ కేసులో మొత్తం దాదాపు 618 మంది స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేయగా, ప్రభాకర్ రావును సైతం పలుమార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఈ కేసులో చిన్న చిన్న గ్యాప్స్‌ను కూడా ఫిల్ చేస్తూ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ముందుకు వెళ్తోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ కస్టోడియల్ విచారణ ఆధారంగా కీలక సమాచారాన్ని సేకరించింది. ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు.
…………………………………………………
