* ప్రజా సమస్యలపైనే సమరం చేద్దాం
* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు
ఆకేరు న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సాగుతున్న వికృత క్రీడపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నుతున్న ‘తిట్ల ట్రాప్’లో పడవద్దని, అసలు చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు, తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలనే ప్రధాన అజెండాగా మార్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధకుడు, పదేళ్లపాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన శిల్పి కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఢిల్లీ పీఠాన్ని కదిలించిన చరిత్ర కేసీఆర్ సొంతమని, ఆయన ఎన్నడూ పదవుల కోసం, సన్మానాల కోసం పాకులాడలేదని గుర్తుచేశారు. “నేడు అధికార మదంతో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి వ్యక్తిత్వంపై విషం చిమ్ముతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, తెలంగాణ అస్తిత్వంపై, ఉద్యమ చరిత్రపై జరుగుతున్న దాడి” అని కేటీఆర్ మండిపడ్డారు.వార్డుల్లో మౌలిక వసతులు, డ్రైనేజీలు, రోడ్లు మరియు సంక్షేమ పథకాల అమలుపై చర్చ జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల సమయంలో.. రేవంత్ రెడ్డి కావాలనే ‘బూతు పురాణం’ అందుకున్నారని కేటీఆర్ విమర్శించారు. తన ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి మరియు హామీల అమలులో మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “రేవంత్ రెడ్డి విసిరే తిట్ల గాలానికి చిక్కకండి. మన పోరాటం ప్రజల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం సాగాలి” ,పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
* రైతు సమస్యలు: ఎరువుల కోసం క్యూ లైన్లు, రైతు భరోసా అందక రైతులు పడుతున్న ఇబ్బందులు.
* విద్యార్థుల ఆవేదన: ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్, గురుకులాల్లో నాణ్యత లేని భోజనం వల్ల విద్యార్థుల మరణాలు.
* ఉద్యోగ, ఉపాధ్యాయులు: పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ మరియు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్.
* హామీల మోసం: ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం.
* కుంభకోణాలు: సింగరేణి బొగ్గు స్కామ్ మరియు విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనను తెలంగాణకు పట్టిన గ్రహణ కాలంగా కేటీఆర్ అభివర్ణించారు. మన నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి ‘కోవర్టు’గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఒక ధ్రువతార అని, ప్రజల తీర్పే ఆయనకు ఇచ్చే అసలైన గౌరవమని పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై ప్రశ్నల పిడుగులు కురిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
………………………………
