*ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం
ఆకేరు న్యూస్, డెస్క్: రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బుధవారం జరగనున్న పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సోమవారం జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు మరియు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు పోలింగ్ జరగనుంది.మొత్తం 8,203 కేంద్రాలను ఏర్పాటు చేశారు.16,031 బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలించారు.ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీని కోసం 136 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే సహించేది లేదని ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్ హెచ్చరించారు.డబ్బు, మద్యం లేదా ఇతర వస్తువుల పంపిణీ చేస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే ప్రచారాలపై కూడా నిఘా ఉంచినట్లు ఆయన స్పష్టం చేశారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ మరియు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
