* హై అలర్ట్ ప్రకటించిన భద్రతా బలగాలు!
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉగ్రవాదులు అలజడి సృష్టించేందుకు కుట్రపన్నారు. చారిత్రక కట్టడం ఎర్రకోట (Red Fort) లక్ష్యంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు (Intelligence Agencies) హెచ్చరించాయి. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఐఈడీ (IED) పేలుళ్లతో విరుచుకుపడేందుకు ఉగ్రవాదులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే చాందిని చౌక్ ప్రాంతంలోని ఒక ప్రముఖ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం అందడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలు, ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఎర్రకోట మరియు దాని పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, శునక దళాలతో (Dog Squads) ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా అనుమానితుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పబ్లిక్ ప్రాంతాల్లో ఏదైనా అనుమానాస్పద వస్తువు లేదా వ్యక్తి కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. ఎర్రకోట సందర్శనకు వచ్చే పర్యాటకులపై కూడా గట్టి నిఘా ఉంచారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
