* బీహార్ నుంచి తరలించిన ఏపీ పోలీస్
* రఘు రామ కృష్ణం రాజు కేసులో కీలక పరిణామం
ఆకేరు న్యూస్ , ఆమరావతి : సీనియర్ పోలీస్ అధికారి ఐజీ సునీల్ నాయక్‌ను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. బీహార్ కేడర్‌కు చెందిన పోలీస్ అధికారి అయిన సునీల్ నాయక్ వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటేషన్ మీద ఏపీ సీఐడీలో పనిచేశారు. అప్పటి ఎంపీ , ఇప్పటి డిప్యూటీ స్పీకర్ రామకృష్ణ రాజు పై నమోదైన రాజద్రోహం కేసు కు సంబందించి , సీఐడీ ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది.
రఘురామ కృష్ణరాజును గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఉంచినప్పుడు, ఆయనను చిత్రహింసలకు గురిచేశారని, కాళ్లపై కొట్టారని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు సునీల్ నాయక్ అక్కడే ఉన్నారని, ఆయన సమక్షంలోనే విచారణ పేరుతో వేధింపులు జరిగాయని రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గుంటూరు నగరం ఆరో లైన్ పోలీస్ స్టేషన్లో సునీల్ నాయక్‌తో పాటు ఇతర అధికారులపై కేసులు నమోదయ్యాయి. నోటీసులకు స్పందించకపోవడంతో, ఏపీ పోలీసుల బృందం బీహార్‌కు చేరుకుంది. పాట్నాలోని ఆయన నివాసంలో సునీల్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
* ఐజీ స్థాయి పోలీస్ అధికారి అరెస్ట్ సంచలనం
ఒక ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారి, మరో రాష్ట్రంలో అరెస్ట్ అవ్వడం జాతీయ స్థాయిలో ఇపుడు చర్చనీయాంశమవుతోంది. విదినిర్వహణలో భాగంగానే తాము రామకృష్ణ రాజును విచారించామని సునీల్ నాయక్ అంటున్నారు. వైస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటేషన్ మీద ఆంధ్ర ప్రదేశ్‌కు వచ్చారు. అనంతర పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. వైయస్ జగన్ ఓటమి పాలయ్యారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒకప్పుడు బాధితుడిగా ఉన్న రఘురామ కృష్ణరాజు ఇప్పుడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయ్యారు.
పాత కేసుల విచారణ వేగవంతమైంది. సునీల్ నాయక్ తన డెప్యూటేషన్ ముగించుకుని తిరిగి బీహార్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన బీహార్‌లో అగ్నిమాపక సేవల విభాగంలో ఐజీ (IG) హోదాలో పనిచేస్తున్నారు.
* నేతలను నమ్ముకుంటే ఇంతేనా..?
రాజకీయ నాయకుల ప్రాపకం కోసం కొద్ది మంది అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులు ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొంటున్నారు. చూసి రమ్మంటే కాల్చి ( మంట పెట్టే ) వచ్చే అధికారుల కోసం రాజకీయ నాయకులు కూడా ఎదురు చూస్తుంటారు. విధినిర్వహణ కంటే నేతల సేవల్లో తరించి పోయే వారిని ఏరి కోరి క్రియాశీలక విభాగాల్లో అత్యున్నత స్థాయి పోస్టింగ్‌లు ఇచ్చుకుంటారు. ఇంకే ముంది చట్టాలను గాలికొదిలేసి లాఠీలకు పనిచెబుతుంటారు. నమ్ముకున్న నేతలు అధికారం కోల్పోగానే వారి ప్రత్యర్థులు అధికారులను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారన్న విషయం తెలుసుకోవాలని రిటైర్డ్ పోలీస్ అధికారులు అంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం , మహిళల రక్షణ , మాఫియాను అరికట్టడంలో ఎంత చురుకైన పాత్ర పోషిస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుంది. కొద్ది మందికి టార్గెట్ అయ్యే అవకాశాలు కూడా లేక పోలేదు. ప్రజల మద్దతు, చట్ట పరమైన రక్షణ కూడా ఉంటుంది కాబట్టి అనంతర కాలంలో ఎలాంటి ఇబ్బంది కరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అందుకు భిన్నంగా నేతల కళ్ళల్లో ఆనందం కోసం పనులు చేస్తే అధికారులు అవమానాలు కావాల్సి ఉంటుందని వారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ని పోలీసులు సైతం సునీల్ నాయక్ పట్ల అదే తీరుగా వ్యవహరిస్తే వారికి ఇలాంటి ఇబ్బందులు రావని చెప్పలేం అంటున్నారు. చట్ట పరంగా విధులు నిర్వహిస్తూ ఎలాంటి పరిణమాలకైనా ఎదురు నిలిచే విదంగా పోలీస్ అధికారులు సూచిస్తున్నారు..
————————————–
