రూ. 1.11 కోట్ల మేర ఖాతాదారులకు టోకరా!
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్: అమాయక ప్రజల నుంచి చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి, గడువు ముగిశాక చేతులెత్తేసిన అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పెరాల శ్రీనివాసరావును ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఏం జరిగిందంటే?
హన్మకొండ జిల్లా వడ్డేపల్లికి చెందిన శ్రీనివాసరావు 2009లో అక్షర చిట్ ఫండ్ పేరుతో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చేసి, వందలాది మంది ప్రజల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించారు. అయితే, చిట్టీల గడువు ముగిసిన తర్వాత ఖాతాదారులకు డబ్బులు చెల్లించకుండా మొహం చాటేస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు.
పోలీసుల దర్యాప్తులో తేలిన విషయాలు. ఒక్క ఆదిలాబాద్ టూ-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే శ్రీనివాసరావుపై 12 కేసులు నమోదయ్యాయి. బాధితులకు సుమారు రూ. 1.11 కోట్లు చెల్లించాల్సి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఇతనిపై మొత్తం 96 చీటింగ్ కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులకు దొరకకుండా గత ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న శ్రీనివాసరావును, సాంకేతిక ఆధారాల సహాయంతో ఆదిలాబాద్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కొన్ని ఆస్తులను జప్తి చేయగా, మిగిలిన వాటిని కూడా చట్టపరంగా స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని ఎస్పీ స్పష్టం చేశారు. మోసపోయిన బాధితులు భయపడాల్సిన అవసరం లేదని, చట్టపరంగా వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హామీ ఇచ్చారు.
